
వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం సహజమే. కానీ ఈ రోజుల్లో మనం తినే కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలు కూడా ఎముకలను బలహీనపరుస్తున్నాయి. ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు చాలా అవసరం. ఇవి ఆహారంలో లేకపోతే ఎముకలు నెమ్మదిగా బలహీనపడతాయి. కాబట్టి మనం ఏం తింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎముకలకు హాని చేసే ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే మూత్రం ద్వారా శరీరంలోని కాల్షియం బయటకు వెళ్లిపోతుంది. ఆ కాల్షియం లోపాన్ని పూడ్చడానికి ఎముకల నుంచి కాల్షియం తగ్గుతుంది. దీని వల్ల ఎముకలు బలహీనమవుతాయి. ఇన్‌స్టంట్ నూడుల్స్, బ్రెడ్, ఊరగాయలు, చిప్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని తగ్గించడం మంచిది. బదులుగా నిమ్మరసం, వేయించిన గింజలు, సుగంధ ద్రవ్యాలు వాడండి.
చక్కెర నేరుగా ఎముకలను దెబ్బతీయదు. కానీ ఎక్కువగా తీసుకుంటే కాల్షియం గ్రహించే శక్తి తగ్గిపోతుంది. వాపు పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త ఎముకలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.
కోలా, సోడా వంటి సాఫ్ట్ డ్రింక్స్‌లో ఫాస్ఫారిక్ యాసిడ్, ఎక్కువ చక్కెర ఉంటాయి. ఇవి ఎముకలను చాలా వేగంగా బలహీనపరుస్తాయి. వీటికి బదులుగా ఇంట్లో చేసుకున్న నిమ్మరసం లేదా ఇతర సహజ డ్రింక్స్ తాగండి.
టీ, కాఫీ రెండింటిలోనూ కెఫిన్ ఉంటుంది. ఇది మనకు శక్తిని ఇస్తుంది కానీ క్రమంగా శరీరంలోని కాల్షియంను తగ్గిస్తుంది. పాలతో తక్కువ మోతాదులో కాఫీ తాగితే ఇబ్బంది ఉండదు. కానీ చక్కెర, కెఫిన్ ఉండే ఎనర్జీ డ్రింక్స్ ఎముకలకు చాలా ప్రమాదకరం.
మద్యం ఎముకలకు చాలా నష్టం చేస్తుంది. ఇది కాల్షియంను గ్రహించడానికి అవసరమైన విటమిన్ డి పనితీరును అడ్డుకుంటుంది. విటమిన్ డి లేకపోతే మనం కాల్షియం ఉన్న ఆహారం తిన్నా అది శరీరానికి ఉపయోగపడదు. ఎక్కువగా మద్యం తాగడం వల్ల ఎముకలను బలంగా చేసే కణాలు కూడా దెబ్బతింటాయి.
వైట్ బ్రెడ్, బిస్కెట్లు ఆరోగ్యం కోసం మంచివి కావు. ఎందుకంటే వీటిలో మాగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఎముకలకు కావాల్సిన పోషకాలు ఉండవు. కేవలం శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. ఇవి కడుపు నింపుతాయి కానీ సరైన పోషకాలు ఇవ్వవు. వీటి బదులు ఓట్స్, బ్రౌన్ రైస్, ధాన్యాలు తినడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)