బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘దబాంగ్ 3’. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఇక సల్మాన్ క్రేజ్ దృష్ట్యా ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా బుధవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు వచ్చింది. సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, సుదీప్, సోనాక్షి సిన్హా తదితరులు భాగ్యనగరంలో సందడి చేసి వెళ్లారు. ఇక ఈ ప్రమోషన్లకు ప్రధానాకర్షణగా నిలిచారు టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రామ్ చరణ్. సల్మాన్‌తో వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉండగా.. భాయ్ నటించిన ఈ చిత్రం కచ్చితంగా తెలుగులోనూ విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ వేడుకలో సల్మాన్‌తో పాటు స్టెప్పులేశారు వెంకీ, చెర్రీ. దబాంగ్ 3లో మున్నా బదనామ్ హువా అనే పాటకు సల్లూభాయ్‌తో వారిద్దరు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా.. వారి వారి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఆనమ్ మీర్జా వివాహ వేడుకలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ దర్శకురాలు ఫరాఖాన్‌తో కలిసి చెర్రీ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.