మా ఎన్నికలు.. మా అధ్యక్షుడు ఎవరు ? .. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో జరగబోయేది ఎంటీ ?.. ఇవే గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటలు.. రసవత్తరంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి ఎలక్షన్స్.. ఎట్టేకలకు ముగిశాయి. మా అధ్యక్ష పదవిని మంచు విష్ణు కైవసం చేసుకున్నారు. కానీ ఎన్నికల అనంతరం సినీ పరిశ్రమలో పెద్ద చర్చ మొదలైంది. మంచు విష్ణు ఎన్నికైనట్టుగా ప్రకటన వచ్చిన కాసేపటికే..మెగా బ్రదర్ నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక నిన్న మా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ సైతం మా అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక మీదట మరిన్ని రాజీనామాలు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ప్రాంతీయ వాదం.. నేను తెలుగు వాడిని కాదు.. అందుకే నన్ను ఓడించారు.. ఇలాంటి ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్లో తాను ఉండలేనంటూ ప్రకాష్ రాజ్ రాజీనామా చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. నన్ను అతిథిగా ఉండమన్నారు.. అలాగే ఉంటాను.. మా నుంచి తప్పుకుంటాను.. కానీ సినిమా నుంచి కాదన్నారు ప్రకాష్ రాజ్. దీంతో అసలు తెలుగు చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక జాతీయ స్థాయి నటుడు.. చిత్రపరిశ్రమలో ప్రాంతీయ భేదం చూస్తున్నారంటూ విమర్శించడం.. అందుకు తగినట్టుగానే ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో పరభాష వ్యక్తిని కాకుండా తెలుగు వ్యక్తిని మాత్రమే ఎంచుకోవడం కూడా సందేహాలకు తావిస్తున్నాయి.
నిజానికి తెలుగు చిత్రపరిశ్రమలో లోకల్ కంటే నాన్ లోకల్ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. చిన్న, పెద్ద పాత్రతో సంబంధం లేకుండా.. ఎక్కువ శాతం ఇతర భాష నటీనటులే ఉన్నారు. కానీ ఎన్నికల్లో నిల్చోకూడదు… మాకు పోటీ రాకూడదు అంటూ పలువురు నటీనటులు చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా.. ఇక మీదట మరిన్ని రాజీనామాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో తెలుగు చిత్రపరిశ్రమ రెండుగా చీలే ప్రమాదముందని సినీ పెద్దలు హెచ్చరిస్తున్నారు. మా ఎన్నికల్లో ఇలాంటి గందరగోళం జరగాల్సి ఉండకూడదని.. స్వయంగా రాఘవేంద్రరావు సైతం ఆవేదన వ్యక్తం చేశారంటే.. ప్రస్తుతం చిత్రపరిశ్రమపరిస్థితికి అద్ధం పడుతుంది.
నిజానికి నాగబాబు అన్నట్టుగా మా మాసకబారిందా ? లేదా బీటలు వారిందా? మా ఎన్నికల తర్వాత మోహన్ బాబు, మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటీ ? రెండు వర్గాల మధ్య జరిగిన పోరు.. ఇప్పుడు సిని’మా’కు దెబ్బపడబోతుందా ? ఇక ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలతో మరో మా అసోసియేషన్ ఏర్పాటు కాబోతుందా ? ఒకవేళ అలాగే జరిగితే టాలీవుడ్ పరిశ్రమలో జరిగే పరిణామాలు ఏంటీ ? లోకల్.. నాన్ లోకల్ అనే వాదనకు మరింత బలం చేకూరి… తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చీలిపోతుందా అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న సందేహాలు.. అలాగే ఎన్నికల అనంతరం కూడా రెండు ప్యానల్ సభ్యుల మధ్య జరుగుతున్న ఈ వార్.. మరో మా అసోసియేషన్ రాబోతుంది అనడానికి చిహ్నంగా కనిపిస్తోంది. మొత్తానికి సిని”మా” పరిశ్రమ రెండుగా విడిపోవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.