హీరోయిన్ దేవిక చివరి రోజులు ఇలా.. ఆమె కుమార్తె కనక ఏమైంది..?
అగ్రతార దేవిక, రఘుపతి వెంకయ్య నాయుడు మనవరాలిగా సినీ రంగంలోకి ప్రవేశించి పలు భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె కుమార్తె కనక సినీ రంగ ప్రవేశం, తల్లి దేవిక కఠిన నిబంధనల వల్ల ఎదుర్కొన్న సవాళ్లు, ఆ తర్వాత కనక వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు, పోరాటాలతో కూడిన కథ ఇది.

పాత తరం హీరోయిన్లలో దేవికది ఒక ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా పరిశ్రమకు పితామహుడిగా పేరు పొందిన రఘుపతి వెంకయ్య నాయుడుకు దేవిక మనవరాలి వరస అవుతుంది. ఆమె తల్లికి వెంకయ్య గారు చిన్నాన్న. దేవిక తండ్రి గజపతి రావు నాయుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ కుటుంబం ఉన్నతమైనది. దేవిక చిన్నతనం నుంచే న్యాయవాది కావాలని కలలు కనేవారు. ఆమె అసలు పేరు మోహన కృష్ణ. పాఠశాలలో ఈ పేరు మగ పేరులా ఉందని భావించి ప్రమీలా దేవిగా మార్చారు. ఇంట్లో ఆమెను అంతా ముద్దుగా రాణమ్మ అని పిలిచేవారు. దేవిక అమ్మమ్మ కనకమ్మకు జాతకాలపై అపార నమ్మకం ఉండేది. ఒక జ్యోతిష్యుడు ఆమె మనవరాలికి నాట్యం, సంగీతం నేర్పించమని, రాజ్యాలు ఏలే లక్షణాలు ఉన్నాయని చెప్పడంతో, ప్రమీలకు ఇష్టం లేకపోయినా బలవంతం మీద సంగీతం, నాట్యం నేర్పించారు. సినిమాలకు నృత్య దర్శకత్వం వహించే వేణుగోపాలస్వామి వద్ద కనకమ్మ తన మనవరాలిని శిష్యురాలిగా చేర్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పుట్టిల్లు చిత్రంలో ప్రమీలకు తొలి చిన్న వేషం లభించింది. 1957లో పక్కింటి అమ్మాయి చిత్రంలో అంజలీదేవి స్నేహితురాలిగా మరో పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన రేచుక్క చిత్రంలో వ్యాంప్ వేషం లభించినా, ప్రారంభంలో నటన అనుభవం లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. పట్టుదల కలిగిన దేవిక ఆ విమర్శలను ఛాలెంజ్ గా స్వీకరించారు. తమిళ నాటక సంస్థలతో దోస్తీ కట్టి, శివాజీ గణేశన్ నాటక మండ్రంలో చేరారు. అక్కడ రెండేళ్లపాటు అనేక నాటకాల్లో నటించి తన నటనను మెరుగుపరచుకున్నారు.
1957లో వరుడు కావాలి తెలుగు, తమిళ వెర్షన్లలో నటించిన తర్వాత, అదే ఏడాది వచ్చిన మొదలాళి చిత్రంతో ఆమె పేరే కాదు, ఆమె జాతకమే మారిపోయింది. చిత్ర నిర్మాత ఎం.ఏ. వేణు ప్రమీల పేరుని దేవికగా మార్చారు. దీపావళికి విడుదలైన ఈ చిత్రం, శివాజీ గణేశన్, ఎంజీఆర్‌ల భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీపడి విజయం సాధించడంతో, దేవిక అందరి దృష్టిని ఆకర్షించి స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్నారు. 1958లో వచ్చిన అత్తా ఒక ఇంటి కోడలే చిత్రంతో తెలుగునాట దేవిక ప్రభంజనం మొదలైంది. 1959లో శభాష్ రాముడు చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం రావడంతో ఆమె దశ తిరిగింది. తెలుగు, తమిళ భాషల్లో అద్భుత నటిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా మంచి పట్టు సంపాదించుకున్నారు. తెలుగులో ఎక్కువగా ఎన్టీఆర్, కాంతారావులతో నటించిన దేవిక, తమిళంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ముత్తురామన్లతో బాగా రాణించారు. ఎంజీఆర్ తో మాత్రం ఒక్క సినిమానే చేయగలిగారు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత, పండంటి కాపురం, పాపం పసివాడు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగారు. 1968 ఫిబ్రవరి 12న తమిళ దర్శకుడు దేవదాసును పెళ్లి చేసుకున్న దేవిక, ఆ తర్వాత భర్త దర్శకత్వంలో వెలుగు నేర్పెన్ చిత్రాన్ని నిర్మించారు. దీన్నే తెలుగులో స్త్రీ గౌరవం పేరుతో విడుదల చేశారు. దేవదాస్, దేవిక దంపతులకు ఒక కుమార్తె జన్మించింది, ఆమెకు దేవిక తన అమ్మమ్మ పేరుని ఆధునీకరించి కనక అని పేరు పెట్టారు. కనకను కూడా హీరోయిన్‌గా పరిచయం చేశారు. వాలు జడ తోలు బెల్ట్, బ్రహ్మర్షి విశ్వామిత్ర వంటి తెలుగు చిత్రాల్లో కనక నటించారు.
అయితే కనక తెలుగులో కానీ, తమిళంలో కానీ బిజీ కాకపోవడానికి తల్లి దేవిక ప్రవర్తనే కారణమని చెప్పాలి. దేవిక తన జీవితంలోని చేదు అనుభవాలు కూతురి జీవితంలో రిపీట్ కాకూడదనే భయంతో కనకను అతి జాగ్రత్తగా పెంచారు. ఎవరితోనూ సాన్నిహిత్యం పెరగకుండా తరచుగా మేకప్ మ్యాన్‌లను, హెయిర్ డ్రస్సర్‌లను మార్చేసేవారు, హీరోలతో చనువు పెరగకుండా అనుక్షణం కూతురిని అంటిపెట్టుకుని ఉండేవారు. ఈ నిర్బంధాల కారణంగా కనకను రెండేళ్లపాటు ఏ సినిమాలోనూ బుక్ చేయకూడదని తమిళ నిర్మాతలు నిర్ణయం తీసుకునేంతవరకు పరిస్థితి వెళ్లింది. దేవిక రాజీ ధోరణికి రావడంతో కనక మళ్లీ బిజీ అయ్యారు. 2002 మే 1న గుండెపోటుతో చెన్నైలో దేవిక మరణించారు.
పదేళ్ల నట జీవితంలో 50 చిత్రాల్లో నటించిన కనక 2006 తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆమె జీవితం కూడా కష్టాలమయమే. 2007లో అమృత్ కుమార్ తో వివాహం జరిగి, 15 రోజులకే అతను మాయం అవడంతో ఆమె మానసికంగా డిస్టర్బ్ అయ్యారు. దేవికకు విడాకులు ఇచ్చిన 18 ఏళ్ల తర్వాత ఆమె మాజీ భర్త దేవదాస్ కూతురి దగ్గరకు వచ్చి కనకకు మళ్ళీ పెళ్లి చేయాలని ప్రయత్నించారు. కానీ తనకంటే వయసులో పెద్దయిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి కనక నిరాకరించి దూరంగా వెళ్లిపోయారని చెబుతారు. ఈ దశలోనే ఆమెకు క్యాన్సర్ వచ్చి కోలుకున్నారు.
Also Read: నా భార్య టాప్ హీరోలతో యాక్ట్ చేసింది.. ఆశ్చర్యపరిచే విషయం చెప్పిన గడ్డం నవీన్..
