స్టార్ హీరోయిన్ పై పగబట్టిన నటుడు.. చివరకు చనిపోయాక శవాన్ని కూడా వదల్లేదు

తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని తార ఆమె. ఆమె అద్భుత నటనా ప్రతిభ, వందకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే, ఓ ప్రముఖ నటుడితో ఆమెకున్న విభేదాలు కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. మరణానంతరం కూడా ఆమె భౌతికకాయం అదృశ్యం కావడం ఓ విషాద మిస్టరీగా మిగిలిపోయింది.

స్టార్ హీరోయిన్ పై పగబట్టిన నటుడు.. చివరకు చనిపోయాక శవాన్ని కూడా వదల్లేదు
Actress Pic

Updated on: Jun 13, 2026 | 6:01 PM

ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా మెప్పించారు ఆమె. ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు పసుపులేటి కన్నాంబగారు. 1934 నుండి 1965 వరకు దక్షిణాదిన ఒక తిరుగులేని తెలుగు తారగా వెలుగొందారు. ఆమె నటన, అందం, వ్యక్తిత్వం నేటికీ అనేక మందికి ఆదర్శప్రాయం. ఏలూరులో జన్మించి, గుంటూరులో పెరిగిన కన్నాంబ పెద్ద కుటుంబం నుంచి వచ్చారు. కుటుంబంలో ఆమె ఒక్కరే కూతురు కావడంతో అల్లారుముద్దుగా పెరిగారు. ఐదో తరగతి వరకు చదువుకున్న కన్నాంబకి వీధి నాటకాలు చూడడం, వాటిలోని డైలాగ్స్ ను అనుకరించి ఇంటివారిని నవ్వించడం చాలా ఇష్టం. ఈ ఆసక్తితోనే నావెల్ నాటక సమాజంలో చేరి బాల తారగా పలు పాత్రలు చేశారు. 1935లో హరిశ్చంద్ర చిత్రంతో కన్నాంబ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో హరిశ్చంద్రుని భార్య చంద్రమతి పాత్రను పోషించి, తన తొలి చిత్రంతోనే అద్భుతమైన నటన కనబరిచి మంచి పేరు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమ “మాయ ప్రపంచం, మనకు సూటవదు” అని తల్లిదండ్రులు అన్నప్పటికీ, అనుకున్నది సాధించాలనే పట్టుదలతో కన్నాంబ తన తల్లిదండ్రులకు ఒక మాటిచ్చారు. ఎక్కడ తప్పటడుగు వేయనని, ఎవరికీ లొంగనని, ఒకవేళ తలవంచే పరిస్థితి వస్తే తనను తాను చంపుకుంటానని అన్నారు. ఆమె మాటలు విని, తల్లిదండ్రులు సినిమాల్లోకి వెళ్ళడానికి అనుమతించారు.

అలా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ద్రౌపది వస్త్రాపహరణం, కనకతార, పల్నాటి యుద్ధం, అనార్కలి, దక్షయజ్ఞం, తోడికోడళ్లు వంటి వందకు పైగా చిత్రాల్లో నటించి కన్నాంబ అగ్రతారగా నిలిచారు. 30-40వ దశకంలో ఆమె ఒక సంచలన నటి. ఆమె అందానికి, అభినయానికి అందరూ ఫిదా అయ్యేవారు. భారీ సినిమాల్లో అవకాశాలతో పాటు పేరు, డబ్బు అన్నీ వచ్చాయి. అయితే, కన్నాంబ కెరీర్ సాఫీగా సాగలేదు. అప్పటి ఒక ప్రముఖ తమిళ నటుడు ఆమెకు సమస్యగా మారాడు. కన్నాంబని లొంగ తీసుకోవాలని అతను ప్రయత్నించగా, తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆమె నిరాకరించారు. ఈ రోజుల్లో కాస్టింగ్ కౌచ్ అని పిలువబడే ఇలాంటి చేదు అనుభవమే అప్పట్లో కన్నాంబకి ఎదురైంది. ఆ నటుడిని ఎదిరించినందుకు గాను ఆమెకు క్రమంగా అవకాశాలు తగ్గాయి. చివరికి ఆ నటుడు కన్నాంబ భర్త, సినీ నిర్మాత, దర్శకుడు అయిన కడారు నాగభూషణంని కూడా వదిలిపెట్టలేదు.

కన్నాంబ, ఆమె భర్త పెళ్లి చేసుకున్నాక శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ స్థాపించి సుమతి పాదుక, పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం వంటి పలు తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించారు. వాటికి కడారు నాగభూషణం దర్శకుడు. కన్నాంబ, ఆమె భర్త మంచితనానికి మారుపేరుగా ఉండేవారట. అడిగినవారికి కాదనకుండా డబ్బు ఇవ్వడం, సాక్షి సంతకాలు పెట్టడం వారికి నష్టాలను కలిగించాయి. ఏ నటుడి వల్ల అయితే అవకాశాలు కోల్పోయారో, అదే నటుడితో సినిమా తీసి నష్టాలపాలయ్యారు. ఆ నటుడితో రెండు మూడు సినిమాలు నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకోగా, మొదటి సినిమాను అతని స్నేహితుడి బ్యానర్‌కు ఇవ్వమని అడిగితే ఇచ్చేశారు. 30 శాతం మాత్రమే చెల్లించి, మిగతా 70 శాతం డబ్బు ఇవ్వకపోయినా, రెండో సినిమా తీయడానికి సిద్ధపడ్డారు. ఆ సినిమా సగంలో ఉండగానే వారు రాజకీయాల వైపు మొగ్గుచూపారు, అది కూడా పూర్తి చేయలేకపోయారు.

తన అమ్మమ్మపై ఆ నటుడు పగబట్టాడని, ఆమె కెరీర్‌ను నాశనం చేయడమే కాకుండా తన తాతగారికి అవకాశాలు లేకుండా చేశాడని కన్నాంబ మనవడు పసుపులేటి దేవి చౌదరి గతంలో ఒకసారి పేరు చెప్పకుండా వెల్లడించారు. ఆత్మబలం కన్నాంబ చివరి సినిమా. అదే ఏడాది ఆమె తుదిశ్వాస విడిచారు. ఎలాంటి అనారోగ్యమూ లేక, బతికున్న రోజుల్లో జ్వరం కూడా ఎరుగని కన్నాంబ ప్రశాంతంగా కన్నుమూశారు. అయితే, దురదృష్టవశాత్తు, మనిషి చనిపోయాక కూడా ఆ నటుడు పగ తీర్చుకున్నాడని దేవి చౌదరి తెలిపారు. కన్నాంబ భౌతికకాయాన్ని ఖననం చేశారు. అక్కడ సమాధి కట్టించాలన్నది కుటుంబ సభ్యుల ఆలోచన. అయితే, ఈలోపే శవం మాయమైంది. శరీరం మీద ఉన్న నగల కోసమే దొంగలు మాయం చేశారని కొందరంటే, కాదు ఇది ఆ నటుడి పనే అని మనవడు తెలిపారు. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఆమె శవాన్ని ఎత్తుకెళ్లి నగలన్నీ తీసేసి, శవాన్ని ఎక్కడో పారేశారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినప్పటికీ, ఆ శవం ఏమైందో ఇప్పటికీ తెలియదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us