
వీళ్లు వందలు-వేల గురించి మాట్లాడుతుంటే వాళ్లు కోట్లల్లో నోట్ల కట్టల గురించి ఆలోచిస్తున్నారు. వీళ్లు బతుకుదెరువు గురించి చెబుతుంటే వాళ్లు భారీ బడ్టెట్ల గురించి లెక్చర్లిస్తున్నారు. వీళ్లు జీతంరాళ్లు పెంచమంటే వాళ్లు కోర్టుల్లో తేల్చుకుందామంటారు. సో… వీళ్లకు వాళ్లకు మధ్యలో ఏదో గ్యాప్ ఉంది. థాట్ ప్రాసెస్‌లో తేడాలొచ్చాయా సింకింగ్ ప్రాబ్లమా ఏదైతేనేం.. సగటు సినీ కార్మికుడికి, సినిమాకు తండ్రి లాంటి ప్రొడ్యూసర్‌కీ మధ్య దూరం. ఆ దూరం తగ్గేదెలా? తగ్గేదాకా షూటింగులకు బందేనా? మీ సమ్మె వల్ల నా ఒక్కడి సినిమాకే రోజుకు కోటిన్నర నష్టం వస్తోందని వాపోతాడు ఒక నిర్మాత. భారీ సెట్టేసుకుని, 800 మంది వర్కర్స్‌ని తీసుకుని, ఆర్టిస్టులకు కాల్‌షీట్లిచ్చి వారం రోజులుగా పని ఆగిపోతే ఏ నిర్మాతకు మాత్రం కడుపు మండదు? రాజా సాబ్ ఒక్కడే కాదు, అఖండ2, వవన్‌కల్యాణ్-ఉస్తాద్ భగత్‌సింగ్, చిరూ అనిల్‌రావివూడి కాంబో లాంటి భారీసైజు ప్రాజెక్టులతో పాటు సిద్ధూజొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం లాంటి మీడియం రేంజ్ సినిమాలన్నీ షూటింగుల్లేక చతికిపడ్డవే. రిలీజ్ డేట్లిచ్చి, ప్రమోషన్లు మొదలుపెట్టుకున్నవాళ్లే. వారం రోజులు కావొస్తున్నా ఎటూ తెమలకపోవడంతో, ఇండస్ట్రీ మొత్తానికి ఇప్పటికే దాదాపు వందకోట్ల దాకా గండి పడ్డట్టు ఒక లెక్కుంది. ఇంకా కొనసాగితే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోక తప్పదు. ఐనా కార్మికులు, నిర్మాతలు ఎవ్వరూ తగ్గడం లేదు. తెగేదాకా లాగడమే వీళ్ల ఉద్దేశమా? వేతనాల పెంపు దగ్గర మొదలైంది సంక్షోభం. ఇప్పుడు కొత్తకొత్త కండిషన్లు పుట్టుకొచ్చి, ఇగో సమస్యలు...