
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు కృష్ణవంశీ, తన సినీ ప్రయాణం గురించి, కొన్ని ముఖ్యమైన చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను, వ్యక్తిగత అనుభవాలను ఇటీవల పంచుకున్నారు. ఆయన మాటల్లో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన జ్ఞాపకశక్తి, మొగుడు సినిమాతో ఎదురైన చేదు అనుభవాలు, అంతఃపురం కోసం సౌందర్యను ఎంపిక చేయడంలో తొలుత తటపటాయించిన వైనం వంటి అనేక అంశాలు బయటపడ్డాయి. కృష్ణవంశీ.. జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన జ్ఞాపకశక్తిని చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. “జూనియర్ ఎన్టీఆర్ మెమరీ ఎక్స్‌ట్రార్డినరీ, రాక్షసుడు వాడు,” అని ప్రశంసించారు. రాఖీ క్లైమాక్స్ సన్నివేశంలో పది నిమిషాల నిడివి గల పెద్ద డైలాగును ఎన్టీఆర్ సులభంగా చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఆ సన్నివేశం చూసి నటి సుహాసిని కూడా కంటతడి పెట్టుకుని, వెంటనే వెళ్లిపోయారని వివరించారు. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ వంటి కొంతమందికి కూడా మంచి జ్ఞాపకశక్తి ఉందని తెలిపారు.
తన కెరీర్‌లో మొగుడు సినిమా ఒక చేదు అనుభవంగా మిగిలిపోయిందని కృష్ణవంశీ స్పష్టం చేశారు. “అది నా జీవితంలోనే ఓ చేదు అనుభవం. నాకు ఆ సినిమా నచ్చలేదు. నాకే నేను నచ్చలేదు ఆ ఏడెనిమిది నెలలు,” అని అన్నారు కృష్ణవంశీ . ఒక వ్యక్తి మోసం వల్ల ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని, అయినప్పటికీ దానిని పూర్తి చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నిర్మాణం పరిస్థితులు ఒక క్రియేటర్ పై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఒక్కోసారి కథాంశాన్ని, ఎవరితో పనిచేయాలనుకున్నామో కూడా మార్చుకోవాల్సి వస్తుందని వివరించారు. మొగుడు, పైసా తన ఫిల్మోగ్రఫీలో అత్యంత నిరాశపరిచిన చిత్రాలని, వాటి వైఫల్యానికి కారణం తన అసమర్థత, అసహాయత అని ఒప్పుకున్నారు కృష్ణవంశీ.
అలాగే కృష్ణవంశీ అంతఃపురం సినిమా కోసం నటి సౌందర్యను మొదట ఎంపిక చేయాలనుకోలేదని వెల్లడించారు. ఒక కొత్త ఇమేజ్, ఎన్ఆర్ఐ నేపథ్యం ఉన్న నటిని అనుకున్నానని, బీచ్ ఒడ్డున పెరిగిన అమ్మాయి పాత్రకు సౌందర్య సరిపోదని భావించానన్నారు. అయితే అప్పటికే సౌందర్య అప్పటికే టిపికల్ తెలుగు సినిమాలలో నటిస్తూ ఉండటంతో, ఆమె ఇమేజ్ ఆ పాత్రకు అడ్డుగా ఉంటుందని అనుకున్నానని చెప్పారు. అయితే, రెండు రోజుల షూటింగ్ తర్వాత సౌందర్య ఆ పాత్రకు ఎంత పర్ఫెక్ట్‌గా సరిపోయారో తనకు అర్థమైందని, ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి