
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా కొన్ని రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ లో విధులు నిర్వహిస్తోన్నలుగు జవాన్ మురళీ నాయక్ అమరుడైన సంగతి తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లి తాండ గ్రామానికి చెందిన మురళీకి చిన్నప్పటి నుంచి సైన్యంలో పనిచేయాలన్నది ఆకాంక్ష. అందుకు తగ్గట్టుగానే రాత్రింబవళ్లు కష్టపడిన అతను 2022లో అగ్నివీర్ గా సైన్యంలో చేరాడు. కానీ భారత్- పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగగా, జమ్మూకశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వర్తిస్తూ శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు మురళీ. ఈ విషాదం నుంచి అతని కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. కాగా మురళీ నాయక్‌కు నివాళి అర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అతని స్వగ్రామానికి వస్తున్నారు. జవాన్ తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, నటుడు శివారెడ్డి వీర జవాన్ కు నివాళి అర్పించారు.
శుక్రవారం (మే16) సత్యసాయి జిల్లా కళ్లితాండ గ్రామానికి వచ్చిన ఆయన అమరుడైన మురళి నాయక్‌కు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే జవాన్ తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో ఒక్కగానొక్క కుమారుడిని సైన్యంలోకి పంపిన మురళీ నాయక మాతృమూర్తి కాళ్లకు శివారెడ్డి నమస్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
అంతకు ముందు అమర వీరుడికి నివాళి అర్పిస్తూ టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ ఒక పాట పాడింది. ‘సైన్యమై, సంకల్పంతో సాగినవా ఓ సైనికుడా.. తూటాల వర్షంలో తడిసినవా ఓ వీరుడా’ అంటూ సాంగే ఈ పాట యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించేలా ఆ సాంగ్ ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.