
Taraka Ratna Passed Away: మొదట్లో క్యూట్ లవర్ బాయ్.. ఆ తర్వాత ఖతర్నాక్ పోలీసాఫీసర్, కాలం కలిసిరానప్పుడు కరడు గట్టిన విలన్ కూడా అతడే. క్రేజ్‌తో సంబంధం లేకపోయినా నిండైన కమిట్‌మెంటున్న కథానాయకుడతడు. శాయశక్తులా శ్రమించడం.. ఇచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేయడం.. ఇది మాత్రమే తెలిసిన అరుదైన నటుడు. టోటల్‌గా సినిమాతో రెండు దశాబ్దాల అనుబంధం. నాలుగు పదులైనా నిండకముందే.. ఇక సెలవంటూ వెళ్లిపోయారు. ఆయన జ్ఞాపకాలు మాత్రం తెలుగు సినిమాపై ఎప్పటికీ పదిలమే.
దాదాపు ఇరవయ్యేళ్ల కిందట తెలుగుతెరకు పరిచయమైన తారకరత్న.. అప్పట్లో ఒక యువ సంచలనం. నందమూరి ఇలాఖాలో నయా సెన్సేషన్. 19 ఏళ్ల వయసులోనే కథానాయకుడైన నిఖార్సయిన ఒకటో నంబర్ కుర్రాడిగా నిలిచాడు.
నందమూరి వంశంలో థర్డ్ జెనరేషన్‌కి అసలైన వారసుడు అతడే అనే మాటలు గట్టిగా వినిపించిన రోజులవి. కానీ.. ఎన్టీయార్ మనవడనే ట్యాగ్ ఉన్నా.. ఆయనకది సంపూర్ణంగా ఉపయోగపడలేదు. ఆయన కెరీర్ ఆద్యంతం ఆటుపోట్లే.
తండ్రి నందమూరి మోహనకృష్ణ. ఎన్టీయార్ సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా చేసేవారు. అంతకుమించిన సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏదీ లేకపోయినా.. సినిమాలే ప్రాణంగా పెరిగాడు తారకరత్న. ఎన్టీయార్ మనువడిగా 2002లో ఒకేసారి తొమ్మిది సినిమాలతో లాంచ్ అయ్యారు తారకరత్న. ఒకే రోజు ఒకే ముహూర్తంలో ఇన్ని సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరో అనే రేరెస్ట్ క్రెడిట్ తారకరత్న ఖాతాలోనే ఉంది.
మొదలుపెట్టిన తొమ్మిది సినిమాల్లో కేవలం ఐదే రిలీజుకు నోచుకున్నాయి. ఒకటో నంబర్ కుర్రాడు, యువరత్న సినిమాలు పెర్ఫామెన్స్ పరంగా తారకరత్నకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. టాలీవుడ్‌లో లవర్‌బాయ్‌గా గుర్తింపు తీసుకొచ్చాయి.
భద్రాద్రిరాముడు వరకూ తారకరత్న గ్రాఫ్ రాకెట్‌లా దూసుకెళ్లినా.. ఆ తర్వాత డౌన్‌ట్రెండ్ తప్పలేదు. హీరోగా తనకున్న క్రేజ్ కొద్దికొద్దిగా తగ్గుతోందనిపించినా ఆయన మాత్రం కుంగిపోలేదు. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యాలన్న కమిట్‌మెంటూ తగ్గలేదు. సినిమా మీదు తనకున్న ప్యాషన్‌నే పెట్టుబడిగా నటిస్తూనే ఉండిపోయారు. ప్రేక్షకుడితో కనెక్టివిటీని ఇంచయినా తెంచుకోలేకపోయారు.
వెర్సటైల్ డైరెక్టర్ రవిబాబు సూచన మేరకు విలన్‌గా మారి కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ పాత్రలో నటించిన ఈ సినిమాకు నంది పురస్కారం గెల్చుకుంది. తర్వాతొచ్చిన నందీశ్వరుడు మూవీ కూడా తారకరత్న నటనకు విశ్వరూపం లాంటిదే. అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టి సంఘ విద్రోహశక్తిగా మారిన ఒక ఉత్తమ విద్యార్థి పాత్రలో జీవించారు తారకరత్న.
నటుడిగా పరిశ్రమలో నిలదొక్కుకోడానికి తారకరత్న చెయ్యని ప్రయత్నమే లేదు. ఫలితం కాస్త అటూఇటూ అయినా వెనక్కు తగ్గే నైజం కాదు తారకరత్నది. నారా రోహిత్‌తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుని చిన్నసైజు మల్టిస్టారర్‌లో నటించారు.
డిజిటల్ ఏరా మొదలయ్యాక ఓటీటీల వైపు చూశారు. గత ఏడాది 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించి ది బెస్ట్ అనిపించుకున్నారు. క్రిష్ జాగర్లమూడి కథ ఇచ్చి, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ మూవీలో పోలీసాఫీసర్‌గా రాణించారు తారకరత్న.
తారకరత్న కమిటైన మరో రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. బాబాయ్ బాలయ్య హీరోగా నటిస్తున్న అనిల్ రావిపూడి మూవీలో కూడా తారకరత్న కోసం విలన్ క్యారెక్టర్ సిద్ధమైందట. నటుడిగా మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. మళ్లీ బిజీ కాబోతున్నారని అందరూ అనుకున్నారు. ఈలోగానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి.. టాలీవుడ్‌కి షాకిచ్చారు తెలుగు సినిమా యువరత్నం.