నందమూరి తారకరత్న ఇక లేరు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. జనవరి 27న లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తారకరత్న కూడా హాజరయ్యారు. కుప్పంలో పాదయాత్ర మొదలైన కాసేపటికి ఆయన నడుస్తూనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలకు తీసుకెళ్లి వైద్యం అందించారు. అయితే రెండ్రోజులుగా ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు.
నందమూరి తారకరత్న మృతితో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్. తారకరత్నకు నివాళులు అర్పించేందుకు లోకేష్ రేపు ఉదయం హైదరాబాద్ బయలుదేరనున్నారు.
తారకరత్న మరణంతో నారా లోకోష్ కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కన్నీటి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.’బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కలమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకు కన్నీటి నివాళులతో..’ అంటూ రాసుకొచ్చారు.
నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.(2/2)
— Lokesh Nara (@naralokesh) February 18, 2023
తారకరత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిలలోని తన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు. ఈ రోజు రాత్రి 11.30 గంటలకు నారాయణ హృదయాలయ నుంచి తారకరత్నను కుటుంబసభ్యులు హైదరాబాద్ తరలించనున్నారు.