
తమిళ్ స్టార్ హీరో సూర్య (Surya) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల జైభీమ్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు ఈ స్టార్ హీరో. ఇక కొద్ది రోజుల క్రితం ఈటీ సినిమాతో హిట్ అందుకున్నాడు సూర్య. కేవలం తమిళంలోనే కాకుండా.. సూర్యకు తెలుగులోనూ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. సూర్య నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్‌లో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సినిమాల పరంగానే కాకుండా.. సూర్య నిజజీవితంలోనూ రియల్ హీరో అన్న సంగతి తెలిసిందే. సామాజిక కార్యక్రమాల్లో పాల్గోనడమే కాకుండా.. ఎంతో మంది పేద కుటుంబాలకు తనవంతు సాయం చేశారు. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన తన అభిమాని జగదీష్ (27) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడు సూర్యకు వీరాభిమాని.. అభిమాని మరణవార్త తెలుసుకున్న సూర్య అతని ఇంటికి వెళ్లాడు.. జగదీష్ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడాడు.. తన అభిమాని భార్యకు ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చారు. అంతేకాకుండా.. అతని కూతురి బాధ్యతను పూర్తిగా తనే తీసుకుంటానని.. ఆమె చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. స్టార్ హీరో సూర్య అభిమానికి ఇంటికి వెళ్లి.. కుటుంబానికి భరోసా ఇవ్వడంపట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.