
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, ఎన్నో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. గతంలో ఓ ఇంటర్వ్యూలో కృష్ణ, ఆయన సతీమణి, దర్శకురాలు విజయనిర్మల పంచుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో వారిద్దరూ పంచుకున్న విషయాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రస్తుత తరం స్టార్ హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లలో మీకు నచ్చిన నటుడు ఎవరు అని ప్రశ్నించగా.. సూపర్ స్టార్ కృష్ణ ఏమాత్రం తడుముకోకుండా “జూనియర్ ఎన్టీఆర్” అని సమాధానమిచ్చారు. తారక్ నటన, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ పట్ల కృష్ణకు ఉన్న గౌరవాన్ని ఈ సమాధానం తెలియజేస్తుంది. అదేవిధంగా తన కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన పాత చిత్రాలలో దేనిని రీమేక్ చేయాలనుంది అనే ప్రశ్నకు.. కృష్ణ తన క్లాసిక్ స్పై థ్రిల్లర్ “గూఢచారి 116” ని అన్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆధునిక హంగులతో ఆ సినిమాను మహేష్‌తో తీస్తే బాగుంటుందని ఆయన చెప్పుకోచ్చారు.
ఒకవేళ మహేష్ బాబును తానే స్వయంగా డైరెక్ట్ చేయాల్సి వస్తే, ఒక పవర్‌ఫుల్ జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ అడ్వెంచర్ కథను ఎంచుకుంటానని కృష్ణ పేర్కొన్నారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, టాలీవుడ్ లెజెండ్ ఎన్టీఆర్ (సీనియర్ ఎన్టీఆర్)తో తనకున్న అనుబంధాన్ని కృష్ణ గుర్తుచేసుకున్నారు. కృష్ణ నటించిన మైలురాయి లాంటి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారని, కృష్ణను కౌగిలించుకుని మరీ అభినందించారని చెప్పారు. ఈ పాత్రకు కృష్ణ మాత్రమే పూర్తి న్యాయం చేయగలరని ఎన్టీఆర్ స్వయంగా కొనియాడడం గమనార్హం.
అలాగే విజయనిర్మల మాట్లాడుతూ జయసుధ, విజయశాంతి వంటి మహానటీల ప్రతిభను తానే ముందుగా గుర్తించి ఇండస్ట్రీకి పరిచయం చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ పాత తరం జ్ఞాపకాలను, ఇప్పటి తరం స్టార్లపై ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.