అప్పటి వరకూ మూస ధోరణిలో కొట్టుకుపోతున్న, తెలుగు సినిమా కళామ తల్లికి విలువల వలువలు చుట్టి, సంప్రదాయం తిలకం దిద్ది, సాంస్కృతిక సింధూరమెట్టిన కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో.. సినీ రంగంలో శాస్త్రీయ నృత్యం, ఆధునిక డ్యాన్స్ ని అయినా అలవోకగా చేసే హీరో.. కళ్ళతోనే నవరసాలను పండించగల మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా శుభలేఖ. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి, కె.విశ్వనాధ్ కి “ఫిల్మ్ ఫేర్” అవార్డ్ ను అందించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు థియేటర్స్ లో శతదినోత్సవ వేడుకలను జరుపుకుంది. ఈ సినిమాలో చిరంజీవి ఎంట్రీ నుంచి చివర సన్నివేశం పెళ్లి వరకూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అప్పటి వరకూ దొరికిన పాత్రలను అంగీకరిస్తూ స్నేహితుల్లో ఒకడిగా మాత్రమే కాదు నెగెటివ్ పాత్రలు చేస్తున్న చిరంజీవికి హీరో స్థానాన్ని సుస్థిరం చేసిన సినిమా శుభలగ్నం. విశ్వనాథ్-చిరంజీవిల కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా శుభలేఖ. తర్వాత స్వయంకృషి, ఆపద్బాంధవుడు సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే శుభలేఖ సినిమా కట్న సమస్య గురించి, సమాజంలో మగ పిల్లలను ప్లస్ లుగా ఆడపిల్లలను మైనస్ లుగా భావించే తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తూనే హీరో పాత్రతో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని, హీరోయిన్ తో మహిళల ధృఢ వ్యక్తిత్వాన్ని విశ్వనాథ్ చూపించారు.
ఈ రోజుకీ సమాజాన్ని వరకట్నం అనే సమస్య వేధిస్తోంది. సంతలో గొడ్డుని బేరం చేసినట్లు వరుడి తల్లిదండ్రులు తమ కోడుకి బేరానికి పెట్టే పాత్రలో సత్యనారాయణ.. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని నమ్ముకుని డిగ్రీ పట్టాపుచ్చుకోవడం కోసం ప్రయత్నలు చేసే యువకుడిగా చిరంజీవి, పెళ్లి అవసరం అమ్మాయికి మాత్రమే కాదు.. అబ్బాయిలకు కూడా ఉంది..ఆడపిల్లలను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఎందుకు శక్తికి మించి కట్నాలు ఇచ్చి కూతురు పెళ్లి చేసి ఇబ్బంది పడాలి అంటూ ప్రశ్నింస్తూ మహిళల ధృఢ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన సుమలత.. ఇలా ఈ సినిమాలో ప్రతి పాత్ర ఒక గొప్పదనాన్ని సమాజంలో మనుషుల ఆలోచనలు, తీరుతెన్నులను పరిచయం చేస్తుంది.
తల్లిదండ్రుల ను విడిచి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఒక యువతికి అన్నీ తానై అండగా నిలిచిన యువకుడు.. తెలియని ప్రాంతానికి వెళ్ళడమే కాదు.. అక్కడ తమ గురించి చెప్పి ఒక ఇల్లుని అద్దెకు తీసుకోవడమే కాదు ఆ యువతి జీవనోపాధికి ఉద్యోగం చూడడం, హీరోయిన్ పెళ్లి తన బాధ్యతగా భావించి ఒక గొప్ప వ్యాపార వేత్తతో పెళ్లి కుదర్చడం ఇవన్నీ ఈ సినిమాలో ఆకట్టుకునే సన్నివేశాలే..
ఈ సినిమాలో కీలక పాత్ర సత్యనారాయణది ఇతర పాత్రల్లో రమణమూర్తి , రాళ్ళపల్లి , సాక్షి రంగారావు , సప్తపది గిరీష్ , అరుణ్ , వంకాయల, నిర్మలమ్మ , పుష్పకుమారి , అల్లు రామలింగయ్య లతో పాటు తులసి, సుభలేఖ సుధాకర్ లు నటించారు.
అప్పుడే సహజీవనాన్ని అందంగా యువతీ, యువకుల మధ్య స్నేహం ఎంత పవిత్రంగా ఉంటుందో.. భాద్యతగా ఉంటుందో తెలియజేసింది ఈ సినిమా శుభలేఖ. ఈ సినిమా మొత్తం విశ్వనాధ్ , చిరంజీవిలే కనిపిస్తారు. విశ్వనాధుకి ఉత్తమ దర్శకుడిగా ..చిరంజీవికి ఉత్తమ నటుడిగా మొదటి ఫిలింఫేర్ అవార్డుని తెచ్చిపెట్టిన సినిమా.. ఈ సినిమా హిందీలోకి కూడా రీమేక్ చేశారు.