
తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన అద్భుతమైన గాన మాధుర్యంతో ఒక తరాన్ని ఆకట్టుకున్న విశిష్ట గాయకుడు వి. రామకృష్ణ (విశ్వంరాజు రామకృష్ణ). విభిన్న శైలులలో పాటలు పాడి ప్రేక్షకుల మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆయన ప్రస్థానం ఎన్నో మలుపులు, సవాళ్లతో కూడుకున్నది. విజయనగరంలో 1947 ఆగస్టు 20న పుట్టిన రామకృష్ణ, ప్రముఖ గాయని పి. సుశీలకు స్వయానా అక్క కొడుకు. చిన్నతనం నుంచే సంగీతం పట్ల మక్కువ పెంచుకున్న ఆయన, ఘంటసాల గారి పాటలను వింటూ, ఆయన గాన ధోరణిని అలవరుచుకున్నారు. అయితే, ఆయన తండ్రికి రామకృష్ణ పాటలు పాడటం ఇష్టం ఉండేది కాదు. పాటల మోజులో చదువు నిర్లక్ష్యం అవుతుందేమోనని ఆయన బెంగ. తండ్రికి తెలియకుండా పాటలు పాడుతూ, ఒక దశలో “ఘంటసాల ఎంగిలి పాటలు నీకు కూడు పెట్టవు” అని తండ్రి నిరుత్సాహపరచినా, రామకృష్ణ మనసు సంగీతాన్ని వీడలేకపోయింది. అనుకోకుండా సినిమాల్లో పాటలు పాడే అవకాశం లభించింది. ప్రసాదరావు నిర్మించిన ఒక లఘు చిత్రంలో హైదరాబాద్ గాయకుడు కె.బి.కె. మోహన్ రాజ్ అందుబాటులో లేకపోవడంతో, ఘంటసాలలా పాడే రామకృష్ణకు ఆ అవకాశం దక్కింది. ఆ పాటను విన్న అక్కినేని నాగేశ్వరరావు, విచిత్ర బంధం చిత్రంలో రెండు పాటలు పాడే అవకాశం కల్పించారు. చిక్కావు చేతికి చిలకమ్మ, వయసే ఒక పూల తోట వంటి పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఘంటసాల మరణానంతరం ఏర్పడిన శూన్యతను రామకృష్ణ తన గానంతో కొంతమేర భర్తీ చేయగలిగారు. అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలకు ఆయన పాటలు పాడారు. ధనమా దైవమా చిత్రంలో ఎన్టీఆర్ కోసం రామా శ్రీరామా పాటను, దాన వీర శూర కర్ణలో కృష్ణుడి పద్యాలను ఆలపించి ఎన్టీఆర్ ప్రశంసలు అందుకున్నారు.
మొదట్లో ఘంటసాల గారిని అనుకరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజాలు ఆయనకు అండగా నిలిచారు. శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు కూడా తమ చిత్రాల్లో రామకృష్ణతోనే పాడించాలని పట్టుబట్టేవారు. అమరదీపం చిత్రంలో కృష్ణంరాజు పట్టుదల వల్లే రామకృష్ణ పాడిన నా జీవన సంధ్యా సమయం పాట చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సంగీత దర్శకుడు సత్యాన్ని రామకృష్ణ ఛాలెంజ్ చేసి, పాటను రికార్డు చేయించి విజయం సాధించిన సంఘటన ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఘంటసాల సైతం రామకృష్ణ గాన సామర్థ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించారు. తాత-మనవడు చిత్రంలోని అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం పాట రిహార్సల్స్ సమయంలో ఘంటసాల గారు రామకృష్ణను అభినందించారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో తెలుగు వీర లేవరా పాటను పూర్తి చేయలేకపోయినప్పుడు, మిగిలిన పాటను రామకృష్ణతో పాడించాలని సూచించి, ఆయనకు సమానమైన పారితోషికం ఇప్పించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. భక్త తుకారాంలో శ్యామసుందర ప్రేమ మందిర, శారద చిత్రంలో శారదా నిను చేరగా, పల్లెటూరి బావలో ఒసే వయ్యారి రంగీ, సెక్రటరీలో నా పక్కన చోటున్నది ఒక్కరికే, అమరదీపంలో ఇంతే ఈ జీవితం, భక్త కన్నప్పలో శివ శివ శంకర, ముత్యాల ముగ్గులో ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు వంటి ఎన్నో అద్భుతమైన పాటలతో రామకృష్ణ తెలుగు ప్రేక్షకులను అలరించారు.
అయినప్పటికీ, ఒక దశలో రామకృష్ణకు అవకాశాలు తగ్గిపోయాయి, పాటలే లేని పరిస్థితి ఏర్పడింది. స్వతఃసిద్ధమైన గాత్రంతో, అగ్ర గాయకుడిగా ఎదగగల సత్తా ఉన్న ఆయన కెరీర్‌కు అడ్డుపడింది ఒక రకంగా మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి అని వెటరన్ ఫిల్మ్ జర్నలిస్టులు చెబుతుంటారు. రాగదీపం సినిమాలో అక్కనేని కోసం ఓ పాటను రామకృష్ణ పాడాలి. అయితే మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తికి రామకృష్ణతో పాడించడం ఇష్టం లేదు. బాలుతో పాడించాలని కోరిక. అయితే దర్శకుడు దాసరి మాత్రం రామకృష్ణతో ఆ పాట పాడించాలని పట్టుబట్టి పాడించారు. అయితే ఈ ఘటన రామకృష్ణపై చక్రవర్తి ఆగ్రహానికి కారణమైంది. ఇండస్ట్రీలో ఎలా ఉంటావో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చేవరకు వెళ్లిందట. ఫైనల్‌గా రామకృష్ణ పాడిన పాటను సినిమాలో లేకుండా చేశారట చక్రవర్తి. ఆ తర్వాత కాలంలో.. రామకృష్ణకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే చనిపోయే ముందు రోజుల్లో చక్రవర్తి తన తప్పు తెలుసుకుని.. రామకృష్ణను ఇంటికి పిలిచి పశ్చాత్తాపం వ్యక్తపరిచినట్లు సమాచారం.
తన సహ గాయని జ్యోతికను రామకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. నటుడు సాయి కిరణ్ రామకృష్ణ కుమారుడే. రామకృష్ణ తన 68 ఏట.. 2015, జులై 16న క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.