“నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన”.. అంటూ విరహగీతాన్ని.. ఫీల్ మై లవ్ అంటూ అమ్మాయి ముందు అబ్బాయి ప్రేమను…గుర్తుకొస్తున్నాయి అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను తన గాత్రంతో శ్రోతల మనసుకు చేరువచేశాడు ప్రముఖ గాయకుడు కేకే. కృష్ణ కుమార్ కున్నాత్ అకాలమరణంతో యావత్ సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇండస్ట్రీ మరో అద్భుతమైన సింగర్ ను కోల్పోయింది. 1996లో తమిళంలో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన కాదల్ దేశం (ప్రేమ దేశం) సినిమాలో నేపథ్య గాయకుడిగా చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేశాడు కేకే. ఈ సినిమాలో కల్లూరి సలై.. హలో డాక్టర్ పాటలు పాడారు. తెలుగులో కాలేజీ స్టైలే.. హలో డాక్టర్ పాటలను ఆలపించారు. మూడు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్లో హిందీలో 500లకు పైగా.. తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళీ భాషలలో దాదాపు 200లకు పైగా పాటలను ఆలపించారు కేకే.
మొదటి నుంచి కేకేకు పాటలు పాడటమంటే ఇష్టం. ఏ పని చేస్తున్న పాటలు పాడుతూ ఉండేవాడు.. 6వ తరగతి నుంచి తన స్నేహితురాలిగా ఉన్న జ్యోతి అనే అమ్మాయిని 1991లో ప్రేమ వివాహం చేసుకున్నారు కేకే. ఆయనకు పాటలంటే ఇష్టమని జ్యోతికి అప్పటికే తెలుసు. కానీ కుటుంబం కోసం తన ఇష్టాన్ని చంపుకుని సేల్స్ మేన్ గా ఉద్యోగం చేస్తుండేవారు. అదే సమయంలో ఉద్యోగాన్ని వదిలేసి పాటలు పాడాలని భార్య ఇచ్చిన ప్రోత్సాహించింది. దీంతో ఉద్యోగాన్ని వదిలి ఇష్టమైన రంగం వైపు అడుగులు వేశాడు కేకే. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతూ.. చివరి వరకు పాట పాడుతూనే ఉన్నాడు కేకే. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ పాటలను ఆలపించి.. ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్న కేకే అకాలమరణం పట్ల అభిమానులు, తారలు సంతాపం ప్రకటించారు.