
దివంగత రెబల్ స్టార్, నటుడు, రాజకీయ నాయకుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి, ఆయన మరణానంతరం తమ జీవితాన్ని, ఆయన జ్ఞాపకాలను కొనసాగించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణంరాజు గారి జీవితం సినిమా రంగం, రాజకీయాలు అనే రెండు పడవల ప్రయాణంలా సాగిందని, ఈ రెండింటినీ ఆయన ఎంతో సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు గారి మరణం తర్వాత, తాను, పిల్లలు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్లు శ్యామల దేవి వెల్లడించారు. ఇంకా లేవలేమేమో అన్నంత పరిస్థితి నెలకొందని ఆమె ఆ సమయంలో పడిన వేదనను తెలిపారు.
అలాంటి క్లిష్ట సమయంలో ఆమె కుమారుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన సలహా ఆమె జీవితానికి ఒక కొత్త దిశను చూపిందని తెలిపారు. “మీకు పెదనాన్న అంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మన దగ్గరే ఉన్నారు. సంపూర్ణమైన జీవితం అనుభవించి, ఆయన మన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మీరు బాధపడ్డారు, రోజు బాధపడుతున్నారు, డిప్రెషన్ లోకి వెళ్తున్నారు అంటే ఆయనని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ మీరు పెదనాన్న ఉన్నట్టుగా చూపించాలి కదా. మీరు బాధపడితే ఎవ్వరూ మీ దగ్గరికి రారు. అప్పుడు పెదనాన్న మీ దగ్గర లేనట్టే కదా. ఆయన ఉన్నారు, మనతోనే అనుకుంటే మీరు లేవాలి, తిరగాలి, బయటికి వెళ్ళాలి” అని తన కుమారుడు చెప్పిన మాటలు తనను ఆలోచింపజేశాయని అన్నారు.
ఆ మాటలతో ప్రేరణ పొందిన శ్యామల దేవి, బాధపడే కన్నా కృష్ణంరాజు గారి జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ, నలుగురిలోకి వెళ్తే వారు కూడా ఆనందపడతారని భావించి బయటికి రావడం మొదలుపెట్టా అన్నారు. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలకు హాజరవుతూ, ప్రజలతో మమేకమవుతున్నా అన్నారు. అలాగే సినీ రంగంలో బాలకృష్ణ, మురళీ మోహన్ వంటి ప్రముఖులు, అలాగే కృష్ణ గారి కుటుంబ సభ్యులు తమ కార్యక్రమాలకు ఆమెను ఆహ్వానిస్తున్నారని, ఈ గౌరవం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల బాలకృష్ణ గారు తనకు ఫోన్ చేసి, తన సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. బాలయ్య ఫోన్ చేసి “మీరు వస్తే కృష్ణంరాజు గారు వచ్చినట్లే. నాకు పెద్దాయన అంటే చాలా గౌరవం. దయచేసి వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి” అని బాలకృష్ణ అన్న మాటలు తనకెంతో సంతోషాన్ని కలిగించాయని ఆమె వివరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి