శోభన్‌బాబు.. టాలీవుడ్ సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల హయాంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారాయన. అలాగే మాస్ సినిమాలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత రాముని పాత్రలో తెలుగింటి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పోయే ముఖం శోభన్‌బాబుదే. ఇలా అన్ని జానర్లలోనూ నటించి ఎవర్‌గ్రీన్ సోగ్గాడిగా గుర్తింపు పొందిన నటభూషణ శోభన్‌బాబు జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో తార్నాక చౌరస్తాలో శోభన్ బాబు చిత్ర పటాన్ని ఏర్పాటుచేసి నివాళులు అర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి , శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ రామకృష్ణ హాజరై శోభన్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆదరించే నటుడు శోభన్ బాబు జయంతి వేడుకలు ఏటా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే హైదరాబాద్ మహా నగరంలో శోభన్ బాబు విగ్రహ ఆవిష్కరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకర్యాక్రమంలో శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ చైర్మన్ టి. రామకృష్ణ, అధ్యక్షులు పద్మారావు, ప్రధాన కార్యదర్శి బి. లాల్ బహుదూర్ శాస్త్రి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్మెస్సార్ వర్మ, పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..