సీనియర్ హీరో చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరోగానే కాకుండా..క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి సినీ పరిశ్రమలో ప్ర త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1966లో రంగులరాట్నం సినిమాతో కెరీర్ ఆరంభించిన చంద్రమోహన్ కథానాయకుడిగా దాదాపు 172 సినిమాల్లో నటించారు. అలాగే మొత్తం 932 చిత్రాల్లో నటించి మెప్పించారు.అప్పట్లో చంద్రమోహన్ ను కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో అనేవారు. సిరిసిరి మువ్వ సినిమాలో జయప్రద, పదహారే ళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలో ఆయనతో నటించి అగ్రకథానాయికలుగా వెలిగారు. ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నట జీవితం గురించే కాకుండా వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చంద్రమోహన్ సతీమణి జలంధర మాట్లాడుతూ.. “చంద్రమోహన్ లక్కీ స్టార్ గా అప్పటి హీరోయిన్స్ భావించేవారు. ఆయన చేత్తో ఒక రూపాయి అయినా తీసుకునేవారు. ఇప్పటికీ జనవరి మొదటి తారీఖున చాలా మంది ఇంటికి వచ్చి అలా డబ్బులు తీసుకుంటూ ఉంటారు” అని అన్నారు. భార్య మాటలను విన్న చంద్రమోహన్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే చంద్రమోహన్ మాట్లాడుతూ.. “నేను శోభన్ బాబు గారి మాట వినలేదు. అందువల్ల రూ. 100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నాను..
కొంపల్లి దగ్గర గొల్లపూడి మారుతీ రావు గారి మాటలు విని 35 ఎకరాలున్న ద్రాక్ష తోట కొన్నాను. కానీ మేనేజ్ చేయలేక అమ్మేశాను. అలాగే చెన్నైలోనూ పదిహేను ఎకరాలు అమ్మేశాను. శంషాబాద్ దగ్గర ఆరు ఎకరాలు కొన్నాను. అది కూడా అమ్మేశాను. శోభన్ బాబు గారు వద్దని వారించిన నేను వినలేదు. అలా రూ. 100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్నాను”. అని అన్నారు.