
తెలుగు ఇండస్ట్రీలో తన సహజమైన నటనతో, ముఖ్యంగా సంసార పక్షమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సత్య కృష్ణన్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను పంచుకున్నారు. తాను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అంత సౌకర్యవంతంగా ఉండనని, తన పనియే మాట్లాడాలని నమ్ముతానని ఆమె తెలిపారు. సత్య కృష్ణన్ ఇండస్ట్రీలోకి రావడం పూర్తిగా అనుకోకుండా జరిగిందట. హోటల్ మేనేజ్‌మెంట్ చదువుకుని, తాజ్ గ్రూప్‌లో ఫ్రంట్ ఆఫీస్‌లో పనిచేస్తున్న సమయంలో, దర్శకుడు శేఖర్ కమ్ముల, కో-ప్రొడ్యూసర్ సునీత తాతీ ఆమెను చూసి డాలర్ డ్రీమ్స్ సినిమా కోసం ఆడిషన్‌కు ఆహ్వానించారు. అప్పట్లో సినిమా గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, స్నేహితుడి ప్రోత్సాహంతో ఆడిషన్‌కు వెళ్లారు. ఆమె షిఫ్ట్‌లకు అనుగుణంగా చిత్రీకరణను ప్లాన్ చేసుకుంటూ, ఉద్యోగం చేస్తూనే తన మొదటి సినిమాను పూర్తి చేశారు. సినిమా తన కెరీర్ అవుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు.
డాలర్ డ్రీమ్స్ తర్వాత ఆనంద్ సినిమాతో సత్య కృష్ణన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆమె డైలాగ్స్ అప్పట్లో తెగ ఫేమస్ అయ్యాయి. బొమ్మరిల్లు లాంటి పెద్ద హిట్ సినిమాలో కూడా ఆమె నటించారు. అయితే, ఆనంద్ తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఒకట్రెండు సంవత్సరాలు సినిమాలు చేయలేదని, బెంగళూరు నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాతనే తిరిగి కెరీర్‌ను ప్రారంభించానని చెప్పారు. ఆమెకు గృహిణి, అక్క, వదిన లాంటి పాత్రలకే పరిమితమైన ఒక స్టీరియోటైప్ ఇమేజ్ ఏర్పడిందని, దీనివల్ల దర్శకులు ఆమెతో ఇతర రకాల పాత్రలు చేయించడానికి రిస్క్ తీసుకోవడానికి వెనుకాడతారని ఆమె అభిప్రాయపడ్డారు. తన బాడీ లాంగ్వేజ్‌కు సెట్ కాని పాత్రల పట్ల మాత్రమే అభ్యంతరం ఉంటుందని, మిగిలిన ఏ పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటానని ఆమె వెల్లడించారు. కొన్ని మంచి సినిమాల్లో కూడా ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ ఉంటే బాగుండు అనిపించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
మెంటల్ కృష్ణ సినిమాతో హీరోయిన్‌గా పేరు వచ్చింది. కానీ ఆ తర్వాతే నాకు అవకాశాలు తగ్గాయి. నిర్మాతలు తాను ఇకపై చిన్న పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ చేయనని వారు భావించడం వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోయానని సత్య కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని 24 సంవత్సరాల వయస్సులోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సత్య కృష్ణన్. తన భర్తతో తరచుగా గొడవలు జరుగుతుంటాయని, కానీ చివరికి ఆయనే తగ్గుతారని నవ్వుతూ చెప్పారు. తన అత్తమామలతో తనకు చాలా మంచి బంధం ఉందని, వారు తనను సొంత కూతురికంటే ఎక్కువగా చూసుకున్నారని తెలిపారు. తన అత్తమామలు చాలా ఏళ్లు తనతోనే కలిసి జీవించారని, ఉమ్మడి కుటుంబ జీవనాన్ని తాను ఎంతో ఆస్వాదించానని అన్నారు.