
మూవీ రివ్యూ: సకుటుంబాలా
నటీనటులు: రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్ తదితరులు.
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: ఉదయ్ శర్మ
నిర్మాతలు: హెచ్. మహదేవ్ గౌడ్, హెచ్. నాగరత్న
నూతన సంవత్సర కానుకగా విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సఃకుటుంబానాం. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం లాంటి సీనియర్ నటులు ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
కళ్యాణ్ (రామ్ కిరణ్) ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. బయట ప్రపంచానికి అతనొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తాడు. సిరి (మేఘా ఆకాష్) అనే అనాథ అమ్మాయితో కళ్యాణ్ ప్రేమలో పడతాడు. అయితే కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. కళ్యాణ్ తన కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంటుందని బయట బిల్డప్ ఇస్తుంటాడు కానీ.. నిజానికి ఆ ఇంట్లో పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. హీరోకి తన కుటుంబం అంటేనే పడదు. అసలు ఆ కుటుంబం వెనకున్న కథేంటి..? ఈ ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ ఎలా సుఖాంతమైంది? అనేది వెండితెరపై చూడాల్సిందే..
కథనం:
సినిమా ప్రారంభం హీరో రామ్ కిరణ్ పాత్ర పరిచయంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. బయట సమాజానికి, సోషల్ మీడియాలో తన కుటుంబం గురించి గొప్పలు చెప్పుకోవడం.. కానీ ఇంట్లో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉండటం అనే కాంట్రాస్ట్ మీద వచ్చే సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి. హీరోయిన్ మేఘా ఆకాష్‌తో లవ్ ట్రాక్ చాలా కూల్ గా, ఫ్రెష్‌గా సాగుతుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ భాగంలో సత్య కామెడీ టైమింగ్ సినిమాను ఓకే అనిపించింది. హీరో తన కుటుంబం గురించి దాచిన అసలు నిజం హీరోయిన్ కి లేదా బయట ప్రపంచానికి తెలిసే సన్నివేశం ఇంటర్వెల్ లో వస్తుంది. ఇది సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఆరంభంలో కథ కాస్త నెమ్మదిస్తుంది. ఫ్యామిలీలోని గొడవలను సరిచేయడానికి లేదా కవర్ చేయడానికి హీరో పడే పాట్లు కొన్ని చోట్ల రొటీన్ గా అనిపిస్తాయి. అయితే బ్రహ్మానందం ఎంట్రీతో కథనం మళ్ళీ ఊపందుకుంటుంది.
ఆయన, హీరో మధ్య వచ్చే సన్నివేశాలు పర్లేదు. రాజేంద్ర ప్రసాద్ ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. దర్శకుడు ఉదయ్ శర్మ కామెడీని బాగా హ్యాండిల్ చేసినా, కుటుంబం మధ్య అనుబంధం పెరిగే ఎమోషనల్ ఆర్క్ ఇంకాస్త బలంగా రాసుకుని ఉండాల్సింది. ముగింపులో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు ఓకే. దర్శకుడు కథను చెప్పడంలో వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉన్నా, సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఇంకాస్త డెప్త్ తో ఉండుంటే సినిమా స్థాయి మరింత పెరిగేది.
నటీనటులు:
కొత్త హీరో రామ్ కిరణ్, హీరోయిన్ మేఘా ఆకాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
బ్రహ్మానందం, సత్యల కామెడీ ట్రాక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో చూడడం ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తన అనుభవంతో సినిమాకు వెన్నుముకగా నిలిచారు. మిగిలిన వాళ్ళు ఓకే.
టెక్నికల్ టీం:
మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం (BGM) కొన్ని ఎమోషనల్, కామెడీ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. మధు దాసరి సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. ఎడిటింగ్ పర్లేదు. దర్శకుడు ఉదయ్ శర్మ తీసుకున్న లైన్ బాగానే ఉన్నా.. ఎగ్జిక్యూషన్ ఇంకాస్త ఉండుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్ గా సఃకుటుంబానాం.. రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!