ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna).. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిన్నది..యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రష్మిక.. ఇటీవల పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. ఇందులో గ్రామీమ యువతి శ్రీవల్లి పాత్రలో అదరగొట్టింది. ఇక ఆగస్ట్ చివరి వారంలో పుష్ప 2 పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. అలాగే హిందీలో గుడ్ బై, మిస్టర్ మజ్ను, యానిమల్ చిత్రాల్లో నటిస్తూ తెగ బిజీ అయ్యింది.
ఇటీవలే డైరెక్టర్ హనురాఘవపూడి, హీరో దుల్కర్ సల్మాన్ కాంబోలో వచ్చిన సీతారామం చిత్రంలో కీలకపాత్రలో నటించింది. ఆగస్ట్ 5న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో రష్మిక నటనకు ప్రశంసలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే..పుష్ప సినిమాతో రష్మిక గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కేవలం ఆరు నెలల్లోనే పాన్ ఇండియా లెవల్లో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ రెట్టింపు అయ్యింది. పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఆమె ఇన్ స్టాలో 6 మిలియన్ కు ఫాలోవర్స్ సంపాదించుకుంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలను ఏలేస్తున్న రష్మిక ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందంట. గతంలో రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు హిందీ చిత్రాలకు రూ. 4 కోట్లు.. తెలుగు సినిమాలకు రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తుందని టాక్. ఇక రష్మికకు అంత మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సైతం ఓకే అంటున్నారట. దీంతో అటు రెమ్యునరేషన్ విషయంలోనూ నేషనల్ క్రష్ కు ఎలాంటి సమస్య రావడం లేదట. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో నటిస్తుంది.