
నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి.. ఇప్పుడు బిజినెస్ రంగంలోనూ సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నారు. కేవలం కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఎవరికీ రాని ఒక వినూత్నమైన ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారు. రానా నేతృత్వంలోని ‘స్పిరిట్ మీడియా’ సంస్థ మన దేశంలో ఇండిపెండెంట్ (ఇండీ) సినిమాలకు ఒక అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది. ఒకవైపు నటనలో రాణిస్తూ, మరోవైపు నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఇంకోవైపు స్పిరిట్ మీడియా ద్వారా సరికొత్త బిజినెస్ స్ట్రాటజీలతో రానా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. భారతదేశంలోని అన్ని భాషలకు చెందిన చిన్న చిత్రాలను, విభిన్నమైన క్రియేటివ్ కథలను ప్రోత్సహించడమే లక్ష్యంగా స్పిరిట్ మీడియా అడుగులు వేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకున్నప్పటికీ.. సరైన థియేట్రికల్ రిలీజ్ దొరకని ఎన్నో అద్భుతమైన సినిమాలను ఈ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. మన సంస్కృతికి, నేటివిటీకి దగ్గరగా ఉండే నిజాయితీ గల కథలను థియేటర్లలో ప్రదర్శించేలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రానా తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం వల్ల, పరిశ్రమలో పెద్దగా ఎక్స్‌పోజర్ లేని ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్, రైటర్స్ కి తమ ప్రతిభను దేశవ్యాప్తంగా నిరూపించుకునే ఒక గొప్ప అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం దేశంలో సాగుతున్న ఈ ఇండీ ఫిలిం మూవ్‌మెంట్‌లో నార్త్ ఈస్ట్ సినిమాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తూ వేగంగా పాపులారిటీని సంపాదిస్తున్నాయి. సిక్కిం, అస్సాం, మణిపూర్ వంటి ప్రాంతాల నుండి వస్తున్న చిత్రాలు ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తున్నాయి. అక్కడి విభిన్నమైన జీవన విధానాన్ని, అచ్చమైన హ్యూమన్ ఎమోషన్స్‌ని ఎంతో రియలిస్టిక్‌గా చూపిస్తూ గ్లోబల్ లెవెల్‌లో ఈ సినిమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇటువంటి వైవిధ్యభరితమైన ప్రాంతీయ చిత్రాలకు స్పిరిట్ మీడియా ఒక బలమైన వెన్నుదన్నుగా నిలుస్తూ, భారతీయ సినిమా పరిధిని మరింత విస్తృతం చేస్తోంది. ఈ క్రమంలోనే సిక్కిం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘షేప్ ఆఫ్ మోమో’ అనే వైవిధ్యమైన చిత్రం ఈ వారం థియేటర్లలోకి రాబోతోంది. ట్రిబేనీ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే 15కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ ప్రముఖ మేకర్స్ జోయా అక్తర్, పాయల్ కపాడియా ఈ ప్రాజెక్ట్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా సపోర్ట్ అందించడం విశేషం. ఇలాంటి అరుదైన చిత్రాలను థియేటర్ల వరకు తీసుకురావడం ద్వారా.. రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా సంస్థతో అన్ని ప్రాంతాల సినిమాలకు సమానమైన ప్రాధాన్యతను ఇస్తూ దేశంలో ఒక సరికొత్త సినిమా కల్చర్‌ని బిల్డ్ చేస్తున్నారు. తన వరకు మాత్రమే చూసుకోకుండా.. ఇలాంటి ఆలోచనలతో మంచి సినిమాలతో రానా చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం కదా..!