
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనలో ఎంత పవర్‌ఫుల్ అనిపిస్తారో, బయట అంత సైలెంట్‌గా, అమాయకంగా కనిపిస్తుంటారు. అయితే ఆయనకున్న ఒకే ఒక్క అలవాటు.. మనుషుల పేర్లు మర్చిపోవడం! అప్పుడెప్పుడో ‘RRR’ ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ ఈ విషయాన్ని బయటపెట్టి చరణ్‌ను ఆటాడుకున్నారు. తాజాగా మరోసారి చరణ్ తన మార్క్ మతిమరుపును ప్రదర్శించి మరోసారి అందరినీ నవ్వించారు. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక నటించిన ‘ఛాంపియన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది.
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్, సినిమా యూనిట్‌ను విష్ చేస్తూ స్పీచ్ ఇచ్చారు. ఈ క్రమంలో హీరోయిన్ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు చరణ్ ఒక్కసారిగా ఆగిపోయారు. ఆమె పేరు అనస్వర రాజన్ అని గుర్తుకు రాక పక్కన ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన మొహంలో కనిపించిన ‘అయ్యో మర్చిపోయానే’ అనే ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగానే చరణ్ ఇలా పేర్లు మర్చిపోతుంటారని తెలిసిన మీమర్స్, దీనిపై రకరకాల మీమ్స్ వేస్తున్నారు.
“చరణ్ అన్నకు తన సినిమాల పేర్లు గుర్తున్నాయేమో గానీ, పక్కన ఉన్న హీరోయిన్ పేర్లు మాత్రం ఎప్పటికీ గుర్తుండవు!” అని ఒకరంటే, “ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు.. చరణ్ తన పేరు కూడా మర్చిపోయి ఇంటర్వ్యూలో కూర్చుంటాడని.. ఇప్పుడు అది నిజమైంది!” అంటూ మరొకరు, “హీరోయిన్ అనస్వర అయితే.. చరణ్ మాత్రం ‘నిశ్శబ్దం’ అయిపోయారు! అంటూ ఇంకొకరు.. ఇలా సరదా మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Champion Heroine With Ramcharan
వాస్తవానికి చరణ్ ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో ఉంటారని, అందుకే ఇలా పేర్లు గుర్తుకు రావని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అయినా కూడా ఆ తడబాటును ఆయన కవర్ చేసే విధానం కూడా చాలా క్యూట్‌గా ఉంటుందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. “పేరు ఏదైతే ఏముంది అన్న.. నీ నవ్వు చాలు!” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా ‘ఛాంపియన్’ ఈవెంట్‌లో చరణ్ చేసిన ఈ సరదా పని సినిమాకు మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. రోషన్ మేక హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతోంది. మరి ఈ ‘ఛాంపియన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. రామ్‌చరణ్, జాన్వీకపూర్ జంటగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే!