Jithender Reddy Review: ఓ పోరాట యోధుడి కథ.. జితేందర్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే

| Edited By: Rajeev Rayala

Nov 08, 2024 | 1:59 PM

ఉయ్యాలా జంపాలా, మజ్ను లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు విరించి వర్మ. చాలా ఏళ్ళ తర్వాత ఈయన నుంచి వచ్చిన సినిమా జితేందర్ రెడ్డి. జగిత్యాల టైగర్‌గా పేరు గాంచిన నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్ ఇది.

Jithender Reddy Review: ఓ పోరాట యోధుడి కథ.. జితేందర్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే
Jithender Reddy Movie
Follow us on

మూవీ రివ్యూ: జితేందర్ రెడ్డి

నటీనటులు: రాకేష్‌ వర్రె, వైశాలి రాజ్‌, రియా సుమన్‌, ఛత్రపతి శేఖర్‌, సుబ్బరాజ్‌, రవిప్రకాశ్‌ తదితరులు

సినిమాటోఫ్రీ: వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌

సంగీతం: గోపీ సుందర్‌

ఎడిటింగ్‌: రామకృష్ణ అర్రం

నిర్మాత: ముదుగంటి రవీందర్‌రెడ్డి

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విరించి వర్మ

ఉయ్యాలా జంపాలా, మజ్ను లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు విరించి వర్మ. చాలా ఏళ్ళ తర్వాత ఈయన నుంచి వచ్చిన సినిమా జితేందర్ రెడ్డి. జగిత్యాల టైగర్‌గా పేరు గాంచిన నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్ ఇది. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

1980స్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాలలో జితేందర్‌ రెడ్డి అనే నాయకుడు ఉండేవాడు. ఆయన జీవిత కథే ఈ చిత్రం. ఆయన కుటుంబ సభ్యులంతా పూర్తిగా హైందవ వాదులు.. అలాగే RSS భావజాలం కలిగిన వ్యక్తులు. చిన్నప్పటి నుంచే జితేందర్‌ రెడ్డికి కూడా ఆ భావజాలం ఉంటుంది. హిందూ ధర్మం కోసం ఎంత దూరమైనా వెళ్తుంటాడు. కాలేజ్‌లోనూ కమ్యూనిస్టులతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాడు. దాంతో ఆయన నక్సలైట్లకు టార్గెట్ అవుతాడు. జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రె) తో పాటు గోపన్న (సుబ్బరాజు) లాంటి అభ్యుదయ వాదులు కూడా గ్రామాల్లోని జనాన్ని తమ మాటలతో చైతన్య పరుస్తుంటారు. దాంతో నక్సల్స్‌ వాళ్లను చంపాలని నిర్ణయించుకుంటారు. అసలు ఏబీవీపీ నాయకుడి స్థాయి నుంచి జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడిగా జితేందర్‌ రెడ్డి ఎలా ఎదిగాడు.. జనం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి..? ఆయనకు గోపన్న సహా చాలా మంది నుంచి ఎలాంటి సాయం అందింది అనేది మిగిలిన కథ..

కథనం:

ఈ మధ్య రాజకీయ నాయకులతో పాటు చాలా మంది బయోపిక్స్ వస్తున్నాయి. అలా తెలంగాణలోని జగిత్యాల నాయకుడు అయిన దివంగత ఏబీవీపీ నాయకుడు జితేందర్‌ రెడ్డి కథతో వచ్చిన సినిమా జితేందర్ రెడ్డి. ఆయన పేరుతోనే ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు విరించి వర్మ. 1970-80 మధ్యలో జగిత్యాలలో నక్సలైట్లకు, RSS, ABVP నేతలకు మధ్య జరిగిన పోరాటమే ఈ చిత్ర కథ. అందులో జితేందర్‌ రెడ్డి ఎలాంటి పాత్ర పోషఇంచాడు.. జనాన్ని ఎలా చైతన్యపరిచాడు అనే కథతో వచ్చింది ఈ చిత్రం. జితేందర్‌ రెడ్డి గురించి జగిత్యాల ప్రాంత ప్రజలకు తప్ప మిగిలిన వాళ్ళకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. ఎందుకంటే జిల్లాతోనే ఆయన ప్రాభవం ఆగిపోయింది. ఎదుగుతున్న క్రమంలోనే జితేందర్ రెడ్డిని చంపేసారు నక్సలైట్లు. ఆయన బతికిన చిన్న జీవితంలోనే జనానికి ఏ విధంగా సాయపడ్డాడు అనేది ఈ చిత్రంలో బాగానే చూపించాడు దర్శకుడు విరించి వర్మ. బయోపిక్ అయినా కూడా చాలా వరకు సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నాడు దర్శకుడు. జితేందర్‌ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకుని.. దానికి ఎమోషన్స్ జోడించి కథ రాసుకున్నాడు. ముఖ్యంగా ఆయన జీవితంలో చిన్నపుడు ప్రభావితం చేసిన అంశాలను.. ఎందుకు నక్సలైట్స్ అంటే జిత్తుకు ద్వేశం పెరిగింది అనే విషయాలను బాగానే ఎస్టాబ్లిష్ చేసాడు. ఆ తర్వాత స్టూడెంట్‌ లీడర్‌గా ఎదిగిన తీరు.. అక్కడ్నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ నాయకుడిగా ఎదిగిన విధానం చూపించాడు. నక్సల్స్‌పై జితేందర్‌ రెడ్డి చేసిన పోరాటాలు మొదలైన తర్వాత సినిమా వేగం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి కథ చెప్పాలంటే దర్శకుడికి కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే చాలా మంది నక్సలైట్లను చెడుగా చూపించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. కానీ విరించి వర్మ మాత్రం అప్పుడు జరిగిన కథను ఉన్నది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నమైతే గట్టిగానే చేసాడు. ముఖ్యంగా జితేందర్‌ రెడ్డి ఉన్నంత కాలం సమాజానికి ఏదో మంచి చెయ్యాలనే చూసాడు.. అదే సినిమాలోనూ చూపించాడు దర్శకుడు. పైగా అప్పుడున్న ఓ రాజకీయ పార్టీకి వ్యతిరేక సన్నివేశాలు కూడా సినిమాలో ఉన్నాయి. కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కూడా చాలా వరకు బయోపిక్ ఆకట్టుకునే విధంగానే ఉంటుంది.

నటీనటులు:

జితేందర్ రెడ్డిగా రాకేష్ వర్రె చాలా అద్భుతంగా సెట్ అయ్యాడు. ఆయన నటన సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రాకేష్ నటన బాగా కుదిరింది. మరో కీలక పాత్రలో వైశాలి రాజ్ పర్లేదు. రియా సుమన్ చిన్న పాత్రలోనే నటించారు. సుబ్బరాజు పాత్ర చాలా కీలకం. ఆయన కారెక్టర్ బాగా పేలింది కూడా. మిగిలిన వాళ్లు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

గోపీ సుందార్ అందించిన పాటలు బాగున్నాయి.. ముఖ్యంగా క్లైమాక్స్ సాంగ్ అయితే అద్భుతంగా ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫీ పర్లేదు.. ఎడిటింగ్ కూడా బాగా షార్ప్‌గా కుదిరింది. సినిమాలో చాలా వరకు సీన్స్ అన్నీ బాగా కుదిరాయి. దర్శకుడు విరించి వర్మ గురించి చెప్పాలి.. చాలా సెన్సిబుల్ కథను ఎంతో మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేసినట్లు అనిపించింది. ఎమోషన్స్ పరంగానూ జితేందర్ రెడ్డి బాగానే కుదిరింది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తారు కాబట్టి కచ్చితంగా ఈ సినిమా చూసి డిసప్పాయింట్ అయితే అవ్వరు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా జితేందర్ రెడ్డి.. ధర్మం కోసం 72 బుల్లెట్లు తిన్న పోరాట యోధుడి కథ.