
తెలుగు చిత్రసీమలో బహుముఖ నటుడిగా తనదైన ముద్ర వేసిన రఘువరన్, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. 1990 దశకంలో ఆయన చెప్పిన రెండు లారీల జనాన్ని తీసుకెళ్లి నరికేయండి వంటి డైలాగ్‌లు తెలుగునాట ఎంతగా పాపులర్ అయ్యాయో చెప్పనవసరం లేదు. విలనీకి కొత్త అర్థం చెప్పిన నటుడిగా రఘువరన్ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. భయంకరమైన మేకప్, అరుపులు, కేకలతో సాగిపోతున్న ప్రతినాయకుల ధోరణికి ఆయన అడ్డుకట్ట వేశారు. ట్రెండ్‌కు అనుగుణమైన ఆహార్యంలో కనిపిస్తూ, ఆధునిక శైలిలో మాట్లాడుతూ తేనె పూసిన కత్తిలాంటి విలన్‌గా ఆయన కనిపించడం ఆయన ప్రత్యేకత. మిమిక్రీ కళాకారులు కూడా ఆయన వాయిస్‌ను అనుకరించేవారంటే ఆయన ప్రజాదరణను అర్థం చేసుకోవచ్చు. రఘువరన్ కోయంబత్తూర్‌లో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి హోటల్ వ్యాపారం చేసేవారు. బీఏ సైకాలజీ చేసిన ఆయనకు ఏదో సాధించాలనే తపన ఉండేది. డిగ్రీ పూర్తయ్యాక మద్రాస్ వచ్చి ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. 1981లో వచ్చిన తమిళ చిత్రం ఏళావదు మనిదన్తో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం విడుదలయ్యాక ఆయనకు హీరోగా అవకాశాలు వచ్చినా, ఒక సినిమా కథ విషయంలో జరిగిన చేదు అనుభవం ఆయనను హీరో అనే పదం నుంచే దూరం చేసింది.
తెలుగులో ఆయన నటించిన తొలి చిత్రం కాంచన సీత. దర్శక రత్న దాసరి నారాయణరావు ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే, ఆయనకు పూర్తి గుర్తింపు తెచ్చిన చిత్రం చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం. ఇందులో పోలియో వ్యాధిగ్రస్తుడైన ప్రతినాయకుడిగా ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. రఘువరన్ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ. ఇందులో భవాని పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు ఎన్నో అవకాశాలను తీసుకొచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో దాదాపు 25 చిత్రాల్లో నటించారు. కేవలం విలన్ పాత్రలకే పరిమితం కాకుండా, సుస్వాగతంలో పవన్ కళ్యాణ్‌కు తండ్రిగా, అంజలి సినిమాలో చిన్న పాప తండ్రిగా ఆయన నటించిన తీరు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది.
రజనీకాంత్‌కు రఘువరన్ మంచి స్నేహితుడు. బాషా చిత్రంలో ఆంటోనీ పాత్ర, ముత్తు, అరుణాచలం వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులకు బాగా నచ్చింది. శంకర్ దర్శకత్వం వహించిన ప్రేమికుడు, ఒకే ఒక్కడు చిత్రాల్లో ఆయన అభినయం అందరినీ అలరించింది. ఒకే ఒక్కడు చిత్రంలో ముఖ్యమంత్రిగా తన వయసుకు మించిన పాత్రను ఛాలెంజ్‌గా తీసుకుని, మంత్రుల మేనరిజమ్స్‌ను పరిశీలించి పోషించారు. ఆజాద్ చిత్రంలో పాకిస్తానీ టెర్రరిస్ట్ పాత్ర కోసం టెర్రరిస్టుల వీడియో క్లిప్పింగ్స్‌ను పరిశీలించి మరీ నటించి, నాగార్జున ప్రశంసలు అందుకున్నారు. ఆయన డైలాగ్ చెప్పే తీరు ప్రత్యేకమైనది. స్పష్టంగా, మాటకు మాటకు మధ్య గ్యాప్ ఇస్తూ చెప్పేవారు.
వ్యక్తిగత జీవితంలో, మొదట్లో చెడు అలవాట్లు ఉన్నప్పటికీ, ఆయన వాటిని మానేసి కొత్త జీవితం ప్రారంభించారు. నటి రోహిణితో 1996 ఆగస్టు 23న తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి రిషివరన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, 2004లో రఘువరన్, రోహిణి విడిపోయారు. రఘువరన్ మళ్లీ మద్యానికి బానిస కావడం దీనికి కారణమని అంటారు. ఇదే విషయంపై అప్పట్లో ఆయన తమ్ముడు కీలక కామెంట్స్ చేశారు. తన అన్న మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయి చనిపోయినట్లు తెలిపారు. శనివారం మాత్రమే తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చుకునే చాన్స్ ఉండేదని… ఆదివారం తిరిగి వాళ్లు తీసుకుపోతారని వెల్లడించాడు. అది కోర్టు నిబంధన. తన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వెళ్లిపోతాడో అప్పుడు విపరీతంగా బాధపడేవాడని రఘువరన్ తమ్ముడు స్పష్టం చేశారు. దాంతో మద్యానికి మరింత బానిస అయినట్లు వెల్లడించాడు.
కాగా విడాకుల అనంతరం ఆయన కర్ణాటకలోని ప్రకృతి ఆశ్రమంలో చికిత్స పొందారు. 2008 మార్చి 19న రఘువరన్ 49 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన స్వరపరిచి, పాడిన ఆరు పాటలను రఘువరన్ – ఏ మ్యూజికల్ జర్నీ పేరుతో రోహిణి, కుమారుడు సాయి రిషి ఒక ఆల్బం తయారు చేయగా, రజనీకాంత్ విడుదల చేశారు.