Pushpa 2: తెలుగు సిన్మాని ఎవరూ అందుకోలేనంత ఎత్తున కూర్చోబెట్టిన బన్నీ, సుకుమార్

ఎక్కడన్నా చూశామా? ఎన్నడన్నా విన్నామా? 80దేశాల్లో 12వేలకు పైగా స్క్రీన్లు. ఆరు భాషాలు, ఏడు ఫార్మాట్లు. అవును.. మన సిన్మానే. వరల్డ్‌వైడ్‌ పూనకాలు తెప్పిస్తోంది టాలీవుడ్‌ మూవీ. బెనిఫిట్‌ షోలు, ప్రీమియర్‌ షోలతో థియేటర్ల దగ్గర ఎటుచూసినా జాతరే. పుష్ప అంటే ఫ్లవర్ కాదు నిజంగానే వైల్డ్ ఫైర్. వరల్డ్‌ వైడ్‌ ఫైర్‌. టాలివుడ్ స్టామినా చూసి ప్రపంచమంతా క్లాప్స్ కొడుతోందిప్పుడు.

Pushpa 2: తెలుగు సిన్మాని ఎవరూ అందుకోలేనంత ఎత్తున కూర్చోబెట్టిన బన్నీ, సుకుమార్
Sukumar - Allu Arjun

Updated on: Dec 06, 2024 | 9:30 AM

పుష్ప అంటే ఫైర్‌ కాదు.. వరల్డ్‌వైడ్‌ వైల్డ్‌ ఫైర్‌! అతిశయోక్తేం లేదు. దేశమంతా ఇప్పుడు పుష్ప టూ సిన్మా గురించే మాట్లాడుకుంటోంది. ప్రపంచమంతా టాలీవుడ్‌ స్టామినా గురించి గొప్పగా చెప్పుకుంటోంది. ఇది మా సిన్మా అని టాలీవుడ్‌ గర్వంగా రొమ్మువిరుచుకుంటోంది. బాహుబలి, ట్రిపులార్‌, కల్కి.. ఇప్పుడు పుష్ప. భారత సినిమా తెలుగువైపు చూస్తోంది.

థియేటర్ల దగ్గర పూనకాలు లోడింగ్‌. పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్‌ అంటూ ఊగిపోతున్నారు ఫ్యాన్స్‌. తెలుగురాష్ట్రాల్లో థియేటర్ల దగ్గరే కాదు సౌత్‌లో, నార్త్‌లో చివరికి ఓవర్సీస్‌లో కూడా అదే సీన్‌. నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే.. నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే అన్న పుష్ప టూ పాట చరణాలకు తగ్గట్లే.. అంచనాలను మించిపోతోంది సిన్మాకొస్తున్న రియాక్షన్‌. థియేటర్ల దగ్గర పబ్లిక్‌ని చూస్తుంటే జాతరకొచ్చినట్లు.. అమ్మోరు పూనినట్లే ఉంది ప్రతీచోటా దృశ్యం.

ఒక తెలుగుసిన్మా.. అందులోనూ సీక్వెన్స్‌ సిన్మా ఏకంగా 80 దేశాల్లో విశ్వవ్యాప్తంగా 12వేల500 స్క్రీన్లపై రిలీజ్‌ అవుతుందని కల్లోనైనా ఊహించగలమా. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తోంది మన తెలుగు సిన్మా. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. సిన్మాలో దమ్ముంటేనే ఎవరైనా చూస్తారు. కచ్చితంగా జనంవస్తారన్న నమ్మకంతో తెరకెక్కించారంటేనే అర్ధమైపోవడంలేదూ.. దుమ్మురేపుతున్న మన సిన్మా దమ్మెంతో! ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని దేశవిదేశాల ప్రేక్షకులు ఎదురుచూసేలా చేయడంలోనూ తెలిసిపోవడంలేదూ మన తెలుగు సిన్మా ఎంత ఎత్తుకెదిగిందో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైంది. తొలిరోజే పుష్క పాత సిన్మాల రికార్డులను బద్దలు కొడుతోంది. అత్యధిక ఓపెనింగ్‌ వసూళ్ల రికార్డ్‌ ఇప్పటిదాకా ఆర్ఆర్ఆర్‌ పేరిట ఉండగా.. పుష్ప టూ దాన్ని క్రాస్‌ చేసేసింది. కలెక్షన్స్‌తో పుష్ప టూ అతి బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా రికార్డ్‌కెక్కనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేసింది బన్నీ-సుకుమార్‌ సీక్వెల్‌ మూవీ. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 100 కోట్లకుపైగా రాబట్టింది. కేజీఎఫ్-2, బాహుబలి-2, కల్కి 2898 ఏడీలను అధిగమించి బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడైన చిత్రంగా మరో రికార్డు సృష్టించింది పుష్ప-2.

ఒకప్పుడు కొన్ని సిన్మాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు ఎత్తేశారో తెలిసేది కూడా కాదు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ ప్రపంచస్థాయి సిన్మాలను తెరకెక్కిస్తోంది. అందరినీ మెప్పించే కళాఖండాలను తన ప్రతిభతో చెక్కుతోంది. తెలుగు సిన్మా రిలీజ్‌ ఇప్పుడో భారీ ఈవెంట్‌గా మారిపోయింది. పుష్పటూతో మన టాలీవుడ్‌ స్టామినాని ప్రపంచం మరోసారి గుర్తించింది. గతంలో వందకోట్ల బడ్జెట్‌ అంటేనే అమ్మో అంటూ నోరెళ్లబెట్టేవారు. మనకున్న లిమిటెడ్‌ మార్కెట్‌లో బ్రేక్‌ఈవెన్‌ వస్తుందోలేదోనని కంగారుపడేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ సిన్మా సౌత్‌కే పరిమితం కాదు. దేశంలోనే గిరిగీసుకుని కూర్చోడంలేదు. ఖండాంతరాలకు వ్యాపిస్తోంది మనవాళ్ల మేకింగ్‌.

మేకింగ్‌ టైంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన సిన్మా రిలీజ్‌ తర్వాత థియేటర్స్‌ని షేక్‌ చేస్తోంది. ఒకప్పుడు ఈ రేంజ్‌ సిన్మాలు మనమెప్పుడన్నా తియ్యగలమా అన్న అనుమానమొచ్చేది. కానీ ఇప్పుడు ఆ రేంజ్‌ సిన్మాలు టాలీవుడ్‌లోనే సాధ్యమంటోంది ఫిల్మ్‌ ఇండస్ట్రీ. ట్రయిలర్‌ లాంచింగ్‌ ఫంక్షన్‌కి పాట్నాని వేదిక చేసుకున్నప్పుడే.. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. సినీ పరిశ్రమకు ఏమాత్రం సంబంధంలేని బీహార్‌లో జరిగింది ఈవెంట్‌. దీనికో కారణముంది. పుష్ప రిలీజ్‌ టైంలో దేశమంతా కోవిడ్‌ భయంతో ఇళ్లల్లో తలుపులు బిగించుకున్న సమయంలో.. పుష్ప వన్‌ హిందీ వెర్షన్‌కి నీరాజనం పలికింది బీహార్‌. ఆ కృతజ్ఞతతోనే పాట్నాలో పెట్టిన ట్రయిలర్‌ లాంచింగ్‌ ఈవెంట్‌ సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అయింది.

పాట్నా తర్వాత చెన్నైలో కూడా పెద్ద ఈవెంట్‌ నిర్వహించింది పుష్ప2 టీమ్‌. సౌత్‌ ఇండస్ట్రీలో బన్నీకున్న పాపులారిటీతో చెన్నైకి ప్రాధాన్యమిచ్చారు. తర్వాత పుష్పరాజ్‌ కేరళం పేరుతో కొచ్చిలో ఈవెంట్‌ పర్సనల్‌గా కూడా బన్నీకి స్పెషల్‌. ఎందుకంటే మాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతన్ని తెలుగు హీరోగా కాకుండా తమ ఇండస్ట్రీ హీరోలా చూసుకుంటుంది మళయాళ సినీ పరిశ్రమ. మల్లు అర్జున్‌ అని పిలుచుకుంటారు పుష్పాని. ఇక ఫైనల్‌గా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ అయితే జాతరను తలపించింది. ఫ్యాన్స్‌ పోటెత్తుతారని తెలిసినా అంచనాలను మించిపోయింది అభిమానుల ప్రవాహం. అల్లు అర్జున్‌, సుకుమార్‌ ఇద్దరూ ఎమోషనల్‌ అయ్యారు ఆ ఫంక్షన్‌ స్టేజీమీద.

2021 డిసెంబరు 17న రిలీజైంది పూర్తి యాక్షన్ డ్రామా పుష్ప సిన్మా. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డులు అందుకున్నారు. దీంతో పుష్ప 2 కోసం ప్రేక్షకులు, అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక హీరో అల్లు అర్జున్‌ అయితే మరో ఆలోచన లేకుండా, మరో సిన్మా వైపు చూడకుండా అదే గెటప్‌ మెయింటెన్‌ చేస్తూ పుష్పకోసం తను కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తూ వచ్చారు. డే వన్‌ నుంచి పుష్ప టూ మీద ఫుల్‌ కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు అల్లు అర్జున్‌. ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో కూడా ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టించేలా ఉంది పుష్ప టూ.. ది రూల్‌. యూనిట్‌ అఫీషియల్‌గా చెప్పకపోయినా వెయ్యికోట్లు దాటిందని ఇండస్ట్రీ టాక్‌. ఇదే నిజమైతే ఫ్యాన్‌ చెబుతున్నట్లు టోటల్‌ కలెక్షన్స్‌ 2వేలకోట్లు దాటినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదేమో.

మనం టాప్‌లో ఉన్నప్పుడు ఈగోలకు పోకూడదు. పుష్పటూలో విజిల్స్‌ కొట్టించుకునే హీరో డైలాగుల్లో ఇదికూడా ఒకటి. అందుకే పుష్ప2 ప్రమోషన్‌ బాధ్యతల్ని కథానాయకుడే తన భుజాలకెత్తుకున్నాడు. మాస్‌ హీరోగా ఈ సిన్మాతో మరింత ఎలివేట్‌ కావడమే కాదు.. తెలుగు సిన్మాని ఎవరూ అందుకోలేనంత ఎత్తున కూర్చోబెట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.