Varanasi: సెట్స్‌లో ‘ద లయన్ కింగ్’ సీన్ రిపీట్.. అడవి ఏనుగుల మధ్య మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సాహసం!

వెండితెరపై మనం చూసే అద్భుతాలు కేవలం గ్రాఫిక్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతాయని అనుకుంటే పొరపాటే. ఒక దర్శకుడు తాను అనుకున్న విజువల్స్ కోసం ప్రాణాలకు తెగించి మరీ అడవుల్లో వేట సాగిస్తుంటే, ఆ ప్రయాణం ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం.

Varanasi: సెట్స్‌లో ‘ద లయన్ కింగ్’ సీన్ రిపీట్.. అడవి ఏనుగుల మధ్య మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సాహసం!
Maheshbabu And Priyanka Chopra

Updated on: Feb 06, 2026 | 8:05 AM

ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసాన్ని మన తెలుగు దర్శకుడు ఇప్పుడు కెన్యా అడవుల్లో చేసి చూపించారు. అది కూడా అడవి ఏనుగుల గుంపు మధ్య, వేల సంఖ్యలో వన్యప్రాణులు వలస వెళ్తున్న భీకరమైన శబ్దాల మధ్య ఆ స్టార్ హీరో, గ్లోబల్ హీరోయిన్ నటించాల్సి వచ్చింది. ‘ద లయన్ కింగ్’ సినిమాలో ముఫాసా మరణించే సమయంలో వచ్చే ఆ భయంకరమైన శబ్దాలు వీరికి షూటింగ్ సమయంలో రియల్‌గా వినిపించాయట. అసలు ఆ అడవిలో ఏం జరిగింది? రాజమౌళి ఆ రేంజ్ అవుట్ పుట్ కోసం ఎంతలా కష్టపడ్డారో ఆ గ్లోబల్ బ్యూటీ మాటల్లోనే తెలుసుకుందాం..

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూపులు సాగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక చోప్రా జోనాస్ తాజాగా కెన్యా షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని భయంకరమైన, ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కెన్యా అడవుల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో తమ చుట్టూ ఉన్న వాతావరణం ‘ద లయన్ కింగ్’ సినిమాను గుర్తుకు తెచ్చిందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా అడవి మృగాల వలస సమయంలో వచ్చే ఆ శబ్దాలు తమను విస్మయానికి గురిచేశాయని ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

రాజమౌళి విజన్ కోసం..

ఈ సినిమా కోసం రాజమౌళి ఎంతటి పట్టుదలతో ఉన్నారో ప్రియాంక మాటల్లో స్పష్టమవుతోంది. కెన్యాలో వన్యప్రాణుల వలస సాగే సమయంలోనే ఆ దృశ్యాలను షూట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారట. అందుకోసం జంతువుల వలస ప్రారంభమయ్యే వరకు యూనిట్ మొత్తం వేచి చూసింది. ఎప్పుడైతే ఆ ప్రక్రియ మొదలైందో వెంటనే చిత్ర బృందం మొత్తం అక్కడికి చేరుకుని షూటింగ్‌లో పాల్గొంది. గ్రాఫిక్స్ వాడకుండా ఆ దృశ్యాలను అత్యంత సహజంగా చిత్రీకరించడం కోసమే జక్కన్న ఈ సాహసం చేశారు. ఈ క్రమంలో రక్షణ కోసం రేంజర్లు ఉన్నప్పటికీ, వైడ్ ఫ్రేమ్స్ తీస్తున్నప్పుడు వారు దూరంగా ఉండాల్సి వచ్చేదని ప్రియాంక గుర్తు చేసుకున్నారు.

ఈ షూటింగ్ అనుభవాల గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షూటింగ్ సమయంలో తమ వెనక ఏనుగుల కుటుంబం వెళ్తుంటే వాటిని అనుసరిస్తూ తాము సీన్ చేశామని తెలిపారు. ప్రియాంక చోప్రా దీనిపై స్పందిస్తూ.. “మేమిద్దరం మాట్లాడుకునే సీన్ వెనుక నిజమైన అడవి ఏనుగుల గుంపు ఉంది. ఇది కేవలం కెన్యా ప్రభుత్వం అందించిన సహకారం వల్లే సాధ్యమైంది. ఇలాంటి చిత్రీకరణ గతంలో ఎప్పుడూ జరగలేదు” అని ధీమా వ్యక్తం చేశారు. ప్రకృతి ఒడిలో రాజమౌళి తీసిన ఈ దృశ్యాలు వెండితెరపై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయం.

సింగిల్ పార్ట్..

గతంలో ‘బాహుబలి’ మాదిరిగానే ‘వారణాసి’ కూడా రెండు భాగాలుగా వస్తుందని ప్రచారం జరిగింది. దీనిపై రాజమౌళి స్పందిస్తూ పుకార్లకు చెక్ పెట్టారు. తాము మొదట్లో ఆ ఆలోచన చేసినప్పటికీ, తర్వాత దాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. ‘వారణాసి’ కేవలం ఒకే భాగంగా విడుదలవుతుందని, దీని నిడివి దాదాపు మూడు గంటల వరకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అడవి మృగాల మధ్య, ప్రాణాలకు తెగించి రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం గ్యారంటీ. మహేష్ బాబును ‘రుద్ర’ అనే పవర్ ఫుల్ పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు.