R.Narayana Murthy: తెలుగు తెరకు ఆదర్శాల ఇజాన్ని అద్ది.. జీవితంలో అదే నిజమని ఎగసిపడుతున్న ‘ఎర్ర సముద్రం’!

 సిద్ధాంతాలు చెప్పడానికి చలా బావుంటాయి. వినేవారికి కూడా అబ్బో అనిపిస్తాయి. ప్రాక్టికల్ గా వాటిని ఆచరించడానికి మాత్రం వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళలో అధిక శాతం చెప్పేదొకటి.. చేసేదొకటి..

R.Narayana Murthy: తెలుగు తెరకు ఆదర్శాల ఇజాన్ని అద్ది.. జీవితంలో అదే నిజమని ఎగసిపడుతున్న 'ఎర్ర సముద్రం'!
R. Narayana Murthy
Follow us

|

Updated on: Dec 31, 2021 | 8:35 AM

R.Narayana Murthy: సిద్ధాంతాలు చెప్పడానికి చలా బావుంటాయి. వినేవారికి కూడా అబ్బో అనిపిస్తాయి. ప్రాక్టికల్ గా వాటిని ఆచరించడానికి మాత్రం వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళలో అధిక శాతం చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఆదర్శాలు వల్లెవేస్తారు. ఆచరణలో మాత్రం వాటికి చాలా దూరం ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే.. తీసే సినిమాల్లో ఎన్నో ఆదర్శాలు.. అద్భుతాలు.. చితికిన జీవితాలు.. అభ్యుదయ భావాలు.. ఇలా ఎన్నైనా తెరమీద ఒలకపోసేసి.. ప్రజల నుంచి ఆహా ఓహో అనిపించుకుని కాసులు చేసుకుంటారు. తెరవెనుక మాత్రం ఒక్క ఆదర్శమూ ఆచరణలో కనిపించదు.

చాలా అరుదుగా మాత్రమె ఈ రంగుల ప్రపంచంలో నేనున్నాను అంటూ దండోరా వేసుకుంటూ ఒకడు వస్తాడు. స్వతంత్ర భారతంలో ఎర్రదండును తీసుకుని రైతు రాజ్యం కోసం ఛలో అసెంబ్లీ అంటూ పీపుల్స్ వార్ కి లాల్ సలామ్ చేసి.. దానినే జీవన మార్గంగా మార్చుకుని తెర ముందూ.. వెనుకా.. ఒకేలా ఉంటాడు. సినిమాలో పాత్ర పరంగా చిరిగిన బట్టలు కట్టి కష్టాలను ఎదురీదిన మనిషిగా కనిపించే నటుడు.. బయట ఆడీ కారులో తిరిగే హీరో లాంటి వాడు కాదు.. కెమెరా ముందు.. వెనుకా కూడా ఒకటే తీరు ఆయనది. తాను నమ్మిన ఎర్రబాటను.. సినిమాల్లో రెడ్ కార్పెట్ గా పరుచుకుని ఎదిగిపోవాలని అనుకోలేదు ఆయన. ప్రజల కష్టాన్ని.. రాజ్యాధికారం కోసం కామందులు చేసే అరాచక దురాగతాలను కళ్ళకు కట్టినట్టు చూపించి.. వ్యవస్థలో లోపాలను ఎలుగెత్తి చాటే సినిమాలు తీస్తున్న నిజమైన హీరో. హిట్..ఫట్ తో పనిలేదు. డబ్బు వచ్చినా అదే తీరు.. పోయినా అంతే హుషారు. ఇదంతా చెప్పిన తరువాత ఇక ఆయన పేరు చెప్పకపోయినా మీకు అర్ధం అయిపోయి ఉంటుంది. ఈరోజు పుట్టినరోజు (డిసెంబర్ 31-1953) జరుపుకుంటున్న ఆర్. నారాయణ మూర్తికి శుభాకాంక్షలు చెప్పడం కోసం ఈ కథనం అని. అవును నిజమే.. తను నమ్మిన ఇజాన్ని.. జనం కోసం తన తపనను.. ప్రతి ఫ్రేములోనూ ఆవిష్కరిస్తూ.. ఎప్పటికైనా మన వ్యవస్థలో కాస్తయినా మార్పు రాకపోతుందా అని ఎదురుచూపులు చూస్తున్న స్వచ్చమైన తెలుగోడు ఆర్. నారాయణ మూర్తి.

ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించిన నారాయణ మూర్తి.. తెలుగు తెరపై విప్లవాత్మక భావాల ఎర్రదనాన్ని ప్రజారంజకంగా అద్దుతూ వస్తున్నారు. సినిమా హీరో అవ్వాలని వచ్చి.. అవకాశాలు దొరకకపోయినా విసుగు చెందకుండా..దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తూ సినిమాకి సంబంధించిన విశేషాలు నేర్చుకున్నారు నారాయణ మూర్తి. తన స్నేహితుల సహాయంతో తానే నిర్మాతగా మారి.. స్నేహ చిత్ర బేనర్ పై’ అర్ధరాత్రి స్వతంత్రం’ అంటూ ఒక్కసారిగా విప్లవాత్మక ఆలోచనలను వినూత్నంగా తనదైన శైలిలో ఆవిష్కరించారు. హీరో అంటే ఇలానే ఉండాలి అనే మూస పద్ధతికి వ్యతిరేకంగా ఇలా ఉన్నా హీరోనే అనిపించుకున్నారు నారాయణ మూర్తి. డబ్బుల లెక్కలు పక్కన పెడితే.. నారాయణ మూర్తి సినిమాలు ప్రజల్లో సృష్టించిన ప్రభంజనం లేవేలే వేరు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది రంగుల ప్రపంచంలో దాదాపు అసాధ్యం. ఒదిగి ఉండటం అనే పదానికి నిజమైన అర్ధం చూపించిన వారు నారాయాణ మూర్తి. తన బాట నుంచి నడక.. నడత ఎక్కడా పక్కకు జరగలేదు. హీరోగా నటించిన 26 సినిమాల్లో పడి సినిమాలు సూపర్ హిట్.. అవి అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దీవిటీలు, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగుచుక్కలు. నటించిన పది సినిమాలూ ఫ్లాప్ అయినా హీరో అనే ట్యాగ్ తో సినిమా ఇండస్ట్రీలో కాలర్ ఎగరేసే నటుల్లా.. ఒక్క సినిమా హిట్ అయితే, రెమ్యునరేషన్ పెంచేసే నటుల్లా ఎప్పుడూ గాలిలో తెలిపోలేదు నారాయణ మూర్తి. ముందే చెప్పినట్టు విజయం.. అపజయం రెండూ ఆయనలోని ఒద్దికకు లాల్ సలాం చేసి గౌరవం ఇస్తాయి.

టీవీలో చిన్న యాంకర్ గా ఓ నాలుగు షోలు చేసిన వెంటనే పడవలాంటి కారులో పరుగులు తీసే ఈరోజుల్లో.. ఇండస్ట్రీలో దాదాపుగా ఏభై ఏళ్ళు పూర్తి కావస్తున్నా.. ఇప్పటికీ షేర్ ఆటోలోనే స్తూదియోలకు చేరుకునే ఏకైక వ్యక్తి నారాయణ మూర్తి ఇదొక్కటి చాలు ఆయన తీరు చెప్పడానికి. చెప్పుకుంటూ పోతే నారాయణ మూర్తి ఆదర్శ వ్యవహార శైలి ఒక గ్రంధం అవుతుంది. అరుదుగా ఉండే ఇటువంటి ఆదర్శం.. పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ ఆయన తన భావాల గురించి ఏమి చెప్పారో అయన మాటల్లోనే సంక్షిప్తంగా..

  • అంటరానితనం దుర్మార్గంవంటివి ఇష్టం ఉండవు.
  • పునర్జన్మ, స్వర్గం, నరకం, ఖర్మ సిద్ధాంతం నమ్మను.
  • ఏడిస్తేనే నీ కష్టాలు తొలుగుతాయనుకుంటే ఏడువు అన్న బుద్ధుడి సూక్తి నచ్చి ఏడుపు మానేసాను.
  • కారల్ మార్క్స్ అంతటి వారు కూడా దేవుడు లేడని చెప్పలేదు. నేను భారతీయుణ్ణి. ముఖ్యంగా హిందువుని. ఆ సంప్రదాయాల మధ్య పుట్టి పెరిగిన వాణ్ణి. చెట్లలో, పుట్టలలో, గట్టులలో చివరకు విష సర్పాల్లో కూడా దైవాన్ని చూసే గొప్ప సంస్కృతి మనది. ఆ సంస్కృతిని ఆకళింపు చేసుకున్నాను కాబట్టే నాకు దేవుడంటే నమ్మకం.
  • సాధారణమైన జీవితం గడపడానికి కారణం నా ‘మెంటాలిటీ’. చిన్నప్పట్నుంచీ నేను ఇంతే. నా అభిరుచుల్ని, అభిప్రాయాల్ని, మనోభావాల్ని మార్చుకోలేని అశక్తుణ్ణి. పదిమందీ నన్ను చూసి గొప్పగా చెప్పుకోవాలని నేను ఇలా ఉండను. ఇలా బతకడమే నాకిష్టం. నా రూమ్‌లో చాప, దిండు మాత్రమే ఉంటాయి.. వేప పుల్లతో పళ్లు తోముకుంటా. సబ్బుతో స్నానం చేయను. మొహానికి పౌడర్ రాయను. నా స్వభావం ఇది. చెట్లకింద కూర్చోడం, జనంతో మమేకమవ్వడం.. ఇవే నాకు ఆనందాన్నిచ్చేవి. ఎవరో ఏదో అనుకుంటారని నా స్వభావాన్ని మార్చుకోలేను.
  • మా గురువుగారు నన్ను ‘పీపుల్స్ స్టార్’ అన్నారు. ‘జననాట్యమండలి గజ్జ ఆగిన చోట… ప్రజల గళాన్ని వినిపిస్తున్నాయి నారాయణమూర్తి సినిమాలు’ అన్నాడు గద్దరన్న. స్వదేశీ భారతి అనే ప్రఖ్యాత బెంగాలీ రచయిత ఆయన రాసిన ‘ఆరణ్యక్’ బుక్‌పై ముఖచిత్రంగా నా బొమ్మ వేశాడు. పూరిజగన్నాథ్ తన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని నాకు అంకితమిచ్చాడు. నాకు ఈ తృప్తి చాలు. పెళ్లి విషయంలో కూడా నాకంటూ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలుండేవి. దానికి పెద్దలు ఒప్పుకోలేదు. నేను అభిప్రాయం మార్చుకోలేదు. చివరకు ఒంటరిగా మిగిలిపోయా.
  • దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగ్‌ని చేసి ఆ ఒక్క విషయంలో అన్యాయం చేశాడు. ఇంటికెళ్లగానే.. ఒంటరితనం కమ్మేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు పలకరించే నాథుడు లేకుండా ఒంటరిగా ముడుచుకొని పడుకొని ఉంటాను. తోడులేని నా జీవితం కూడా ఓ జీవితమేనా. ఏ గోంగూరో, లేక చేపల పులుసో తినాలనిపించినప్పుడు, అవి హోటల్లో దొరకనపుడు… అదే నాకంటూ ఓ భార్య ఉంటే వండి పెట్టేది కదా అనిపిస్తుంది. మేం సెటిల్ అవ్వలేదు. అయ్యాక పెళ్ళి చేసుకుంటాం అనే ధోరణి మానండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. చక్కగా పెళ్ళి చేసుకోండి.
  • పేరుప్రఖ్యాతుల కోసం మాత్రమే జీవించేవాడికి మానసిక శాంతి ఉండదు.

ఇవి కూడా చదవండి: Dry List 2022: మద్యం షాపులకు కూడా సెలవులు ఉంటాయని మీకు తెలుసా..? ఏయే రోజుల్లో మూసి ఉంటాయి..!

Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తొలి మరణం.. నైజీరియా నుంచి వచ్చాడన్న అధికారులు.. 1200 దాటిన కేసులు..!

Ration Card: రేషన్‌ కార్డు, ఇళ్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త వ్యవస్థ..!