
సోషల్ మీడియాలో కేవలం తన సినిమాల అప్‌డేట్స్ లేదా అత్యంత సన్నిహితుల గురించి మాత్రమే పోస్టులు పెట్టే ఆ ‘రెబల్ స్టార్’.. తాజాగా ఒక యువ హీరోయిన్ కోసం ఒక స్పెషల్ పోస్ట్ పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. “నీ గొంతు నేరుగా నా మనసును తాకింది” అంటూ ఆయన ఆ ముద్దుగుమ్మను ఆకాశానికి ఎత్తేశారు. ఇంతకీ ఎవరా హీరోయిన్? ప్రభాస్‌ను అంతగా ఫిదా చేసిన ఆమెలోని అద్భుతమైన ప్రతిభ ఏంటి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని ప్రభాస్.. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా బాలీవుడ్ యువ నటి రాషా తడాని పట్ల ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్, అనిల్ తడాని వారసురాలిగా రాషా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాషా కేవలం నటిగానే కాకుండా ఒక గొప్ప సింగర్‌గా కూడా తనలోని సరికొత్త కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.
రాషా తడాని తన బాలీవుడ్ అరంగేట్రం ‘లైకీ లైకా’ అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమాలో ఆమె ‘చాప్ తిలక్’ అనే ఒక మధురమైన పాటను ఆలపించారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పాట విన్న ప్రభాస్.. రాషా గొంతులోని మాధుర్యానికి ఫిదా అయిపోయారు. వెంటనే ఆమె ఫోటోలను షేర్ చేస్తూ.. “రాషా.. నీ సింగింగ్ డెబ్యూ చాలా అద్భుతంగా ఉంది. నీ గొంతు నేరుగా నా మనసును తాకింది” అంటూ మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఎవరి గురించైనా ఇలా బహిరంగంగా పోస్ట్ పెట్టడం ప్రభాస్ కెరీర్‌లో చాలా అరుదుగా జరుగుతుంది, అందుకే ప్రభాస్ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
రాషా తడాని కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ (మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు) హీరోగా పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ద్వారా రాషా తడాని తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ వంటి సెన్సేషనల్ హిట్ అందించిన దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన రాషా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలు పెంచింది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా అయినప్పటికీ, అంతకంటే ముందే ప్రభాస్ వంటి స్టార్ హీరో నుంచి ప్రశంసలు అందడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ కాస్త మొహమాటపడే ప్రభాస్, ఇలా ఒక యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడం ఆయన గొప్ప మనసును చాటుతోంది. తన పోస్ట్ ద్వారా రాషాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. రవీనా టాండన్ కూతురిగా కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి రాషా చేస్తున్న ప్రయత్నాలను అందరూ అభినందిస్తున్నారు.
ప్రభాస్ ప్రశంసలు దక్కించుకున్న రాషా తడాని.. తన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో తెలుగులో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఒకవైపు నటిగా, మరోవైపు సింగర్‌గా రాణిస్తున్న ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందనడంలో సందేహం లేదు.