అన్నగారి ‘శ్రీకృష్ణ పాండవీయం’ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..

నటరత్న ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల పోషణలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. పాండవ వనవాసం చిత్రంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో, దుర్యోధనుడి పాత్రను తాను అనుకున్న శైలిలో చూపించేందుకు స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆయన దర్శకత్వ ప్రతిభకు, పౌరాణిక అభినయానికి నిదర్శనంగా నిలిచి ఘన విజయం సాధించింది.

అన్నగారి శ్రీకృష్ణ పాండవీయం గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
NT Ramarao Srikrishna Paandaveeyam

Updated on: Aug 10, 2026 | 1:12 PM

నటరత్న నందమూరి తారక రామారావు, పురాణ పాత్రలకు ప్రాణం పోయడంలో తనదైన శైలిని ప్రదర్శించి, భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. రావణ, సుయోధన, బృహన్నల వంటి క్లిష్టమైన పాత్రలను సైతం అవలీలగా పోషించి, పౌరాణిక పాత్రల పోషణలో తనే నంబర్ వన్ అని నిరూపించుకున్నారు. కొన్ని చిత్రాలు కేవలం ఆయన నటించడం వల్లే ఆడాయంటే అతిశయోక్తి కాదు. 1960లలోనే హిందీ నిర్మాతలు అధిక పారితోషికం ఆఫర్ చేసినా, తన పౌరాణిక అభినయాన్ని తెలుగుకే పరిమితం చేశారు. అయితే, పాండవ వనవాసం చిత్రంలో ఎన్టీఆర్ భీముడిగా, ఎస్వీ రంగారావు దుర్యోధనుడిగా నటించారు. ఆ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో భీముడి హీరోయిజం దుర్యోధనుడి అభినయం ముందు నిలవలేకపోయింది అన్న విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు ఎన్టీఆర్‌ను ఆలోచింపజేశాయి. దుర్యోధనుడి పాత్రను తనదైన శైలిలో, మరింత ప్రభావవంతంగా పోషించి తీరాలనే పట్టుదలతో స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. విలన్ పాత్రను హీరో స్థాయిలో చూపించిన చిత్రంగా ఇది నిలిచింది. ఇంతకుముందు సీతారామకళ్యాణం, గులేబకావళి కథ చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ, ఎన్టీఆర్ తన పేరును దర్శకుడిగా వేసుకోలేదు. శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి కూడా అలాగే చేద్దాం అనుకున్నారు. కానీ, ఆ సమయంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పి. పుల్లయ్య, దర్శకుడి పేరు లేకుండా సినిమా విడుదల చేయడం దర్శకుడి స్థానాన్ని అవమానించడమే అని నచ్చజెప్పడంతో, ఎన్టీఆర్ ఆ చిత్రానికి దర్శకుడిగా తన పేరును వేసుకున్నారు.

శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నిర్మాతగా వ్యవహరించారు. ఈ అన్నదమ్ముల మధ్య అద్భుతమైన అవగాహన ఉండేది. సెట్లో వారు ఎప్పుడూ మాట్లాడుకునేవారు కాదు, కళ్లతో సైగలు మాత్రమే చేసుకునేవారు. అది మిగిలిన వారికి ఎవరికీ అర్థమయ్యేది కాదు. కథ ఎంపిక, సంగీత చర్చలు, చిత్ర నిర్మాణ పర్యవేక్షణ వంటి బాధ్యతలన్నీ త్రివిక్రమరావు చూసుకునేవారు. నటన, దర్శకత్వం విషయాలను మాత్రమే ఎన్టీఆర్ పర్యవేక్షించేవారు. ఈ చిత్రంలో రుక్మిణిగా కె.ఆర్. విజయ నటించారు, ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. భీముడిగా కన్నడ నటుడు ఉదయ్ కుమార్ నటించగా, కాంతారావు, శోభన్ బాబు, రాజనాల, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాళ, నాగయ్య వంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. భారీ సెట్స్ వేసి, ఎంతో రిచ్‌గా నందమూరి సోదరులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ రోజుల్లోనే శ్రీకృష్ణ పాండవీయం చిత్రం తీయడానికి సుమారు 10 లక్షలు ఖర్చు పెట్టారు. రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా పతాక సన్నివేశంలో శ్రీకృష్ణ విశ్వరూప సందర్శన దృశ్యాన్ని ఆయన అద్భుతంగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఆ ముందురోజు జరిగిన షూటింగ్ రషెస్ చూసేవారు. ఒకరోజు అందరూ కలిసి రష్ చూస్తున్నప్పుడు, 1200 అడుగుల నిడివి కలిగిన దుర్యోధనుడి సన్నివేశం అది. ఎన్టీఆర్ అద్భుత అభినయం చూసి అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. కానీ ఎన్టీఆర్ సీరియస్‌గా ఉండటం చూసి త్రివిక్రమరావు ఏమైందని అడిగారు. దుర్యోధనుడు ఫ్రేంలోకి అడుగుపెడుతున్నప్పుడు కిరీటం కొద్దిగా కదులుతుంది, ఆ షాట్ మళ్లీ తీద్దాం అని ఎన్టీఆర్ అన్నారు. దానికి త్రివిక్రమరావు, “మీరు దర్శకుడు కనుక ఎన్నిసార్లైనా తీద్దాం అంటారు. కానీ నిర్మాతగా నేను డబ్బు, సమయం, ఖర్చు అన్నీ చూసుకోవాలి. అయినా, జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో తన సర్వస్వం కోల్పోయేదానికి అశుభ సూచనగా కిరీటం కదిలింది అని సరిపెట్టుకోవచ్చు కదా,” అన్నారు. తమ్ముడి తెలివితేటలకు ఎన్టీఆర్ ఆనందించి సరేనన్నారు.

శ్రీకృష్ణుడి పాత్ర పోషణలో ఎన్టీఆర్‌కు తిరుగులేదు. శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో దుర్యోధనుడి పాత్రను కూడా అద్భుతంగా పోషించారు. మూడు కిలోల బరువున్న కిరీటాన్ని ధరించి, “నవఖండ భూఖండ పరివ్యాప్తమై” అంటూ దీర్ఘ సమాసాలతో డైలాగులు చెప్పడం ఆయనకే సాధ్యమైంది. 1966 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన శ్రీకృష్ణ పాండవీయం చిత్రం ఘన విజయం సాధించి, ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో మరొక గొప్ప అధ్యాయాన్ని లిఖించింది.

 

( ఈ సమాచారం వెటరన్ ఫిల్మ్ జర్నలిస్టులు నుంచి సేకరించాం)

Loading...
Unable to load recommendations.
Follow Us