Nandamuri Jayakakrishna: సీనియర్ ఎన్టీఆర్ ద్వితీయ పుత్రుడు జయకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?
ఎన్టీఆర్ రెండో కుమారుడు జయకృష్ణ జీవితం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అన్న రామకృష్ణ అకాల మరణం తర్వాత కుటుంబ పెద్దగా బాధ్యతలు చేపట్టిన ఆయన, తండ్రి ఎన్టీఆర్‌కు అండగా నిలిచారు. పెను ప్రమాదం, కుమార్తె మరణం వంటి వ్యక్తిగత విషాదాలు ఎదుర్కొన్నారు. గత ఏడాది సతీవియోగంతో ఆయన కాస్త కుంగిపోయారు.

నటరత్న నందమూరి తారక రామారావు తన 20వ ఏట మేనమామ కాట్రగడ్డ చెంచయ్య కుమార్తె బసవతారకమును 1942 మే 2న కృష్ణా జిల్లాలోని కొమరవోలులో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఎనిమిది మంది మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు. మగపిల్లలకు రామకృష్ణ సీనియర్, జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ జూనియర్, జయశంకర్ కృష్ణ అని, ఆడపిల్లలకు లోకేశ్వరి, పురందరేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి అని పేర్లు పెట్టారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ అప్పట్లో ఇంటికి వచ్చే వారిని ఆప్యాయంగా పలకరించేవారు. తండ్రి ఎన్టీఆర్, పినతండ్రి త్రివిక్రమరావులకు అండగా ఉంటూ సినిమా, వ్యాపార విషయాలపై పట్టు సాధించారు. అయితే, 17 ఏళ్ల వయసులోనే రామకృష్ణ అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులకు తీరని పుత్రశోకం మిగిలింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రెండో కుమారుడు జయకృష్ణ ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యతలు స్వీకరించారు. చదువుకుంటూనే తండ్రి ఎన్టీఆర్, చిన్నాన్న త్రివిక్రమరావులకు సొంత సినిమా నిర్మాణంలో సహాయం చేశారు. భలే తమ్ముడు చిత్ర నిర్మాణంతో పాటు హైదరాబాద్‌లో రామకృష్ణ 70ఎంఎం, 35ఎంఎం థియేటర్ల ప్రారంభోత్సవంలో చురుకైన పాత్ర పోషించారు.
జయకృష్ణ వివాహం దగ్గుబాటి పద్మజా దేవితో 1971 ఏప్రిల్ 12న మద్రాసులోని రాజేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ వివాహానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రులు కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, నటుడు శివాజీ గణేషన్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే, ఎన్టీఆర్‌తో విభేదాల కారణంగా అక్కినేని నాగేశ్వరరావు ఈ వివాహానికి హాజరు కాలేదట. పెళ్లైన ఆరేళ్లకు, 1976 సెప్టెంబర్ 6న జయకృష్ణ ఒక పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శంషాబాద్‌లోని తమ పొలాలను చూసుకుని వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న జీపు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జయకృష్ణ తాత లక్ష్మయ్య చౌదరి మరణించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత, జయకృష్ణ ఆయన వ్యక్తిగత వ్యవహారాలను పర్యవేక్షించారు. ఎన్టీఆర్‌ను కలవాలంటే ఆ రోజుల్లో జయకృష్ణను సంప్రదించాల్సి వచ్చేది.
జయకృష్ణ కుమార్తె కుముదిని వివాహం 1993 మార్చి 11న సికింద్రాబాదులోని జూలూరి వజ్రమ్మ కళ్యాణ మండపంలో దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ మనవడు శ్రీనాథ్ ప్రసాద్‌తో జరిగింది. పెళ్లైన తర్వాత కుముదిని అమెరికా వెళ్లి, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే, భర్తతో వచ్చిన సమస్యల కారణంగా పిల్లలతో ఇండియాకు తిరిగి వచ్చి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించారు. తన కుమార్తె మరణానికి అల్లుడే కారణమని జయకృష్ణ 2004లో కోర్టులో కేసు వేసి, మనవలు జయవిరాజ్ ప్రసాద్, నీల్ కృష్ణ ప్రసాద్‌లను తమకు అప్పగించాలని కోరారు. అయితే, శ్రీనాథ్ ప్రసాద్ అమెరికా పౌరుడు కావడంతో అక్కడి కుటుంబ న్యాయస్థానంలో వాదనలు జరిగి ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తండ్రి ఎన్టీఆర్ మరణం, కుమార్తె విషాదకర సంఘటనల కారణంగా జయకృష్ణ సినిమా పరిశ్రమకు దూరమయ్యారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు బసవతారక రామ క్రియేషన్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించి, తన కుమారుడు చైతన్య కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ బ్రీత్ చిత్రాన్ని నిర్మించారు. చైతన్య కృష్ణ అంతకు ముందు జగపతిబాబు నటించిన ధమ్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. జయకృష్ణ సతీమణి పద్మజా దేవి.. బసవతారకమ్మ తర్వాత కుటుంబ పెద్దగా అందరితో కలుపుగోలుగా ఉండేవారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరుల వివాహ సమయంలో కూడా ఆవిడే దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. పద్మజా దేవి అనారోగ్యంతో ఆగస్టు 19న కన్నుమూయడంతో నందమూరి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
