తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమా తీసిన పద్మనాభం.. ఫలితం ఏమైందంటే..?

కమెడియన్ పద్మనాభం నిర్మించిన దేవత చిత్రానికి సంబంధించిన అజ్ఞాత వాస్తవాలివి. ఎన్టీఆర్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నిర్మాణం అనేక సవాళ్లతో సాగింది. సావిత్రి గర్భవతిగా ఉన్నా, ఎన్టీఆర్ డేట్స్ సమస్యలున్నా, గొప్ప విజయంగా నిలిచింది. పద్మనాభం గృహాన్ని తాకట్టు పెట్టి నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి.

తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమా తీసిన పద్మనాభం.. ఫలితం ఏమైందంటే..?
Padmanabham - Brahmanandam

Updated on: Sep 03, 2026 | 4:57 PM

కమెడియన్‌గా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న పద్మనాభం, కేవలం హాస్యనటనకే పరిమితం కాకుండా వైవిధ్యం కోసం తపించారు. 1958లో వల్లం నరసింహారావుతో కలిసి రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పేరుతో నాటక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అనేక విజయవంతమైన నాటకాలు ప్రదర్శించారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, ఎన్టీఆర్, సావిత్రి ప్రోత్సాహంతో నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆయన తొలి చిత్రం దేవత 1964లో రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైంది. ఈ సినిమా కథా నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. పద్మనాభం రూమ్మేట్, సంగీత దర్శకుడు ఎస్.పి. కోదండపాణికి, రచయిత వీటూరి ఒక కథను చెప్పారు. అది చాలామందికి నచ్చినా, భారీ బడ్జెట్ కారణంగా ఎవరూ సినిమా తీయడానికి ధైర్యం చేయలేకపోయారు. కథ నచ్చిన పద్మనాభం కూడా మొదట వెనుకడుగు వేశారు, ఎందుకంటే ఆయన అప్పటికే నటుడిగా బిజీగా ఉన్నారు, హీరోయిన్ డబుల్ రోల్ కావడంతో నాటకానికి సరిపోదు. అయితే, కోదండపాణి పద్మనాభాన్ని ప్రోత్సహించడంతో, చివరకు సినిమా నిర్మించడానికి అంగీకరించారు. ఈ కథకు ఎన్టీఆర్ అయితే హీరోగా బాగుంటారని భావించి, వీటూరిని వెంటబెట్టుకొని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు పద్మనాభం. తన సహనటుడు నిర్మాతగా మారుతున్నారని తెలియగానే ఎన్టీఆర్ సంతోషించారు. కథ నచ్చడంతో డేట్స్ ఇచ్చి, ఆల్ ది బెస్ట్ బ్రదర్ అని భుజం తట్టారు. హీరోయిన్‌గా సావిత్రిని అనుకొని ఆమె ఇంటికి వెళ్లారు. కథ ఆమెకు కూడా నచ్చింది. “ప్రతి సినిమాలో నాకు ఓ చక్కని పాత్ర లభిస్తే, ఇందులో రెండు ఉన్నాయన్నమాట” అని నవ్వుతూ అన్నారు సావిత్రి. అయితే, ఆ సమయంలో ఆమె మూడు నెలల గర్భవతి. సినిమా పూర్తి చేయడానికి ఆరు నెలలు పట్టవచ్చని, గర్భంతో నటించడం కష్టం కనుక డెలివరీ అయ్యేవరకు ఆగాలని అడిగారు. “లేదు అమ్మా, మేము మూడు నెలల్లోనే చిత్రాన్ని పూర్తి చేస్తాం, మీరు సందేహించకండి” అని పద్మనాభం హామీ ఇచ్చారు. అడ్వాన్స్ ఇస్తుండగా వంద రూపాయల నోటు కింద పడితే, సావిత్రి దాన్ని వంగి తీసుకుని, కళ్లకు అద్దుకొని, “ఇది మంచి శకునం. మీ సినిమా వంద రోజులు ఆడుతుంది చూడండి” అని దీవించారు. ఆమె నోటి వాక్కు ఫలించింది.

ఈ సినిమాకు దేవత అనే టైటిల్ పెట్టాలని పద్మనాభం అనుకున్నారు. దర్శక నిర్మాత బి.ఎన్. రెడ్డి చాలా కాలం క్రితం అదే పేరుతో ఒక సినిమా తీసినందున, పద్మనాభం ఆయన్ని కలిసి అనుమతి కోరారు. “అందరూ పర్మిషన్ తీసుకోకుండానే టైటిల్స్ పెడుతున్నారు. నా మీద గౌరవంతో నువ్వు వచ్చి అడుగుతున్నావు. హ్యాపీగా పెట్టుకో” అని ఆశీర్వదించారు బి.ఎన్. రెడ్డి. కె. హేమాంబరధరరావు దర్శకుడిగా ఎంపికయ్యారు. పద్మనాభం తన ఇంటిని 40,000 రూపాయలకు తాకట్టు పెట్టి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. దేవత చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పద్మనాభం పాత్ర. సినిమా బ్యాక్‌డ్రాప్‌ను ఎన్నుకొని, సినిమా స్టార్స్‌ను చూడటానికి ప్రజలు ఎలా తంటాలు పడతారో చూపించారు. ఎస్.వి. రంగారావు, గుమ్మడి, రేలంగి, కాంతారావు, రమణారెడ్డి, అంజలీదేవి, షావుకారు జానకి, జమున వంటి 22 మంది ప్రముఖ తారలు ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించి, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చే దృశ్యాలు పది నిమిషాల నిడివితో అద్భుతంగా చిత్రీకరించారు. ఇది తెలుగు చిత్ర రంగంలో ప్రప్రథమమని పబ్లిసిటీ కూడా చేశారు. ఈ సినిమాలో పద్మనాభం సరసన గీతాంజలి నటించగా, ఎన్టీఆర్ తల్లిదండ్రులుగా నాగయ్య, నిర్మలమ్మ నటించారు. చిత్ర నిర్మాణ సమయంలోనే నాగయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో, సెట్‌లో వేడుకలు నిర్వహించారు. రాజనాల విలన్‌గా నటించగా, నగేష్ ఫిల్మ్ డైరెక్టర్‌గా, పేకేటి ఆయన అసిస్టెంట్‌గా నటించారు. ఎస్.పి. కోదండపాణి ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించారు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, కన్నుల్లో మిసమిసలు కనిపించని వంటి పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ కాలేజీ లెక్చరర్ ప్రసాద్‌గా నటించారు. తన భార్య సీత రైలు ప్రమాదంలో మరణించిందని తెలియగానే ప్రసాద్ గుండె పగిలేలా రోదించే సన్నివేశం కోసం ఒక అద్భుతమైన నేపథ్య గీతం అవసరమని దర్శకనిర్మాతలు భావించారు. రచయిత వీటూరి 20 రోజులు ప్రయత్నించినా పాట కుదరలేదు. చివరకు మహాకవి శ్రీశ్రీని అడగగా, ఆయన కేవలం రెండే రోజుల్లో “బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుక” అనే పాటను రాసిచ్చారు. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ పాటను ఎన్టీఆర్ మీద చిత్రీకరించాలి. అయితే, ఆయన ఇచ్చిన డేట్స్ అయిపోయాయి, ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి. పద్మనాభం అభ్యర్థన మేరకు ఎన్టీఆర్ మూడు రోజులు నైట్ వర్క్ చేయడానికి అంగీకరించారు. ఇతర షూటింగ్‌లలో పాల్గొని రాత్రి 9 గంటలకు దేవత సెట్‌కు వచ్చి, 12 గంటల వరకు పని చేసేవారు. గ్యాప్ లేకుండా పని చేస్తుండటంతో ఆయనకు నిద్ర కరువైంది. అందుకే సెట్‌లో కునుకు తీసేవారు. వర్షం ఎఫెక్ట్ షాట్స్ కూడా ఇందులో ఉన్నాయి. షాట్‌కు అంతా సిద్ధం చేసి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన దర్శకుడు హేమాంబరధరరావు, “సార్” అని పిలవగానే, “రెడీ బ్రదర్” అని పక్కనే ఉన్న బిందెలో నీళ్లు నెత్తి మీద గుమ్మరించుకొని కెమెరా ముందుకు వచ్చేవారు ఎన్టీఆర్. అలా ఆ పాటను పూర్తి చేశారు. దేవత చిత్రం ఘన విజయం సాధించి, 50 రోజుల వేడుకను రాజమండ్రిలో యూనిట్ సమక్షంలో నిర్వహించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us