
భారతీయులకు దైవ భక్తి ఎక్కువ. అందుకే పుట్టబోయే బిడ్డల నుంచి చేసే వ్యాపారం దాకా ప్రతిదానికీ దేవుళ్ల పేర్లు పెట్టడం ఒక ఆచారం. దేవుళ్ల పేర్లు పెడితే అంతా మంచే జరుగుతుందని వారి నమ్మకం. కానీ ఇటీవల, సినిమాలకు దేవుళ్ల పేర్లు పెట్టడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ప్రారంభించింది. ఇటీవల దేవుళ్ల పేర్లు పెట్టుకున్న కొన్ని సినిమాలు సెన్సార్ అభ్యంతరంతో చివరి నిమిషంలో పేర్లు మార్చుకున్నాయి. వరలక్ష్మి శరత్‌కుమార్ చిత్రం ‘సరస్వతి’ ఇవాళ (మార్చి 06) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సెన్సార్ బోర్డు సినిమా పేరు మార్చాలని పట్టుబట్టి ‘ఎస్ సరస్వతి’గా మార్చింది. నిజానికి, ఇది సరస్వతి అనే సాధారణ మహిళ కథ. కానీ సెన్సార్ బోర్డు టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరి నిమిషంలో పేరు మార్చక తప్పలేదు. దీనికంటే ముందు సుహాస్ సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మొదట ఈ సినిమాకు ‘హే భగవాన్’ అనే పేరు పెట్టారు. కానీ సెన్సార్ బోర్డు ఆ సినిమా పేరులో ‘భగవాన్’ అనే పేరును కూడా మార్చింది. ఆ సినిమా పేరును ‘హే భలవంత్’ గా మార్చిన తర్వాత విడుదలైంది.
సినిమా కథ దేవుడి గురించి అయితే, లేదా అది దేవుడి భక్తుడి గురించి అయితే సెన్సార్ బోర్డు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ సినిమా దీనికి ఉదాహరణ. ఇటీవల సెన్సార్ బోర్డు తీసుకుంటోన్న కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ది కేరళ స్టోరీ 2 సినిమా రిలీజ్ విషయంలో సాక్షాత్తూ సుప్రీం కోర్టే సెన్సార్ బోర్డుకు చీవాట్లు పెట్టింది. ఇక టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ చిత్రం ‘జన నాయగన్’ కూడా సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో రాజకీయ అంశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.