AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: ఏం పాటరా బాబూ! ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్

'రఫ్ అయిన నువ్వు.. టఫ్ అయిన నేను.. మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా యూత్, లవర్స్ కు ఈ పాట తెగ నచ్చేస్తోంది.

Trending Song: ఏం పాటరా బాబూ! ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్
Trending Song
Basha Shek
|

Updated on: Jun 19, 2026 | 7:06 PM

Share

సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వనాథ్ & సన్స్’. బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘నేనో బటర్‌ఫ్లై’ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘నేనో బటర్‌ఫ్లై’ గీతం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. మధురమైన ట్యూన్ తో సరికొత్త అనుభూతిని అందిస్తున్న ఈ గీతం, విన్న తక్షణమే ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమ గీతాలలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వస్తున్న స్పందనను బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో ఈ పాట సంగీత ప్రియుల ప్లేలిస్టుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమాలో కథానాయకుడు సూర్యను ఉద్దేశించి, నాయిక మమిత బైజు పాడుకునే ఈ ‘నేనో బటర్‌ఫ్లై’ గీతం వినసొంపుగా ఉంది. యువత మనసు దోచుకునేలా ఎంతో అందంగా జి.వి. ప్రకాష్ ఈ గీతాన్ని స్వరపరిచారు. మెలోడీల విషయానికి వస్తే జి.వి. ప్రకాష్ కుమార్ ఎప్పుడూ నిరాశపరచరు. మరోసారి ఆయన అద్భుతమైన సంగీతంతో మాయ చేశారు. దర్శకుడు వెంకీ అట్లూరితో ఆయన కాంబినేషన్ వరుసగా ఆకట్టుకుంటుండటంతో, ఈ సినిమా ఆల్బమ్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

“రఫ్ అయిన నువ్వు.. టఫ్ అయిన నేను.. మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే” అంటూ ప్రేమలోని అమాయకత్వం, ఉత్సాహం, భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబించేలా సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవలి బ్లాక్‌బస్టర్ పాటలతో విశేష గుర్తింపు పొందిన గాయని సుబ్లాషిని తన మధురమైన గాత్రంతో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రకటన వచ్చినప్పటి నుంచే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలు, హృదయాన్ని హత్తుకునే అంశాలతో కూడిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ‘సార్/వాథి’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి మరోసారి అన్ని అంశాలతో నిండిన భారీ థియేట్రికల్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ చిత్రంలో సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బంగ్లాన్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకొని, ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

‘విశ్వనాథ్ & సన్స్’ నేనో బటర్ ఫ్లై సాంగ్ లిరికల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us