
నవీన్ పొలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే అనగనగా ఒక రాజు సినిమాతో హిట్టు అందుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం వెనుక ఉన్న కష్టాలను, చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో తన కెరీర్‌ను ప్రారంభించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, అవకాశాలు పెద్దగా రాలేదని ఆయన తెలిపారు. దీంతో ఆడిషన్ల కోసం ముంబైకి వెళ్ళానని, అక్కడ సుమారు మూడు సంవత్సరాలు కష్టపడ్డానని అన్నారు.. ఆ సమయంలో ముంబైలో ఆడిషన్లకు ఒక సరైన వ్యవస్థ లేదని, ధర్మా ప్రొడక్షన్స్, యష్ రాజ్ ఫిలింస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి పెద్ద నిర్మాణ సంస్థల కార్యాలయాల బయట నిలబడివాడేనని చెప్పారు. ఫర్హాన్ అఖ్తర్, ఆదిత్య చోప్రా, అనురాగ్ బసు వంటి ప్రముఖుల వాహనాలను వెంబడించి, వారికి తన పోర్ట్‌ఫోలియోలను అందజేసేవాడినని గుర్తుచేసుకున్నారు. వినాయక చవితి పండల్స్ వద్ద దర్శకుల కోసం నిరీక్షించిన సందర్భాలనూ వివరించారు.
నటుడి కావాలనే కోరిక చిన్నతనం నుండి ఉన్నప్పటికీ, తన తండ్రి షరతు మేరకు ఇంజనీరింగ్ పూర్తి చేశానని తెలిపారు. ఇంజనీరింగ్‌లో మంచి మార్కులు సాధించి, ఆ తర్వాతే తన నటనా ప్రస్థానాన్ని కొనసాగించటానికి అనుమతి లభించిందని వివరించారు. అవకాశాల కోసం ఎదురుచూడటం మానేసి, రైటింగ్ ఇంటర్న్‌గా చేరి, యూట్యూబ్ ద్వారా సొంత అవకాశాలను సృష్టించుకోవడం ప్రారంభించారు. ఏఐబీ వంటి కంటెంట్ క్రియేషన్ గ్రూపులతో కలిసి పనిచేస్తూ, యూట్యూబ్ షార్ట్ ఫిలింలలో నటించి, రచన చేస్తూ, వాటిని వైరల్ చేయగలిగారు. ఇది తనకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించిందని, ప్రొడ్యూసర్ల కోసం ఎదురుచూడకుండా తమ డెస్టినీని తామే రాసుకోవాలని అర్థమైందని నవీన్ పేర్కొన్నారు. యూట్యూబ్‌కు, తన సహ కంటెంట్ క్రియేటర్లకు ఈ విజయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. వారు ఎవరూ నమ్మనప్పుడు తనను నమ్మారని ఆయన గుర్తు చేసుకున్నారు.
బాలీవుడ్‌లో “చిచోరే” వంటి చిత్రాలతో గుర్తింపు పొందినప్పటికీ, తెలుగులో ఒక మంచి సినిమా చేయాలనే కోరిక ఉండేదని నవీన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే దర్శకుడు స్వరూప్ ఆర్‌వి ఫేస్‌బుక్ ద్వారా తనను సంప్రదించారని, “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” కథను చెప్పారని తెలిపారు. స్వరూప్ ఆర్‌వి తన యూపీ క్యారెక్టర్ “మిశ్రా యావరేజ్ మిశ్రా” మోనోలాగ్‌ను చూసి ప్రభావితులై, నవీన్‌ను సంప్రదించారు. ఆ తర్వాత ఎనిమిది నుండి పది నెలల పాటు స్క్రిప్ట్‌పై కలిసి పనిచేసి, ఆ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా విజయం తర్వాత “జాతి రత్నాలు”, మహేష్ దర్శకత్వంలో రాబోయే చిత్రం వంటి అవకాశాలు వచ్చాయని నవీన్ వివరించారు. సినిమా పరిశ్రమ అనేది ఒక వ్యాపారం అని, ఇక్కడ ఎమోషన్స్‌కు చోటు ఉండదని నవీన్ స్పష్టం చేశారు. తనది ఒక మధ్యతరగతి కుటుంబం అని, తల్లి బ్యాంకు క్యాషియర్‌గా, తండ్రి సేల్స్‌మెన్‌గా పనిచేసేవారని, తదనంతరం తండ్రి ఉద్యోగం కోల్పోయినప్పుడు కుటుంబ పరిస్థితులు అంతగా బాగాలేదని నవీన్ గుర్తుచేసుకున్నారు. కష్టాల నుండి బయటపడటానికి విద్యే మార్గం అని తమ ఇంట్లో గట్టి నమ్మకం ఉండేదని, అందుకే తమ ముగ్గురు పిల్లలు బాగా చదువుకున్నారని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..