అక్కినేని నాగార్జున(Nagarjuna) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టారు నాగార్జున. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించిన విషయం తెలిసిందే. బంగార్రాజు సినిమా తర్వాత నాగ్ ఇప్పుడు బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించనున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రవీణ్ సత్తారు తో గోస్ట్ మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో క్రేజీ డైరెక్టర్ కు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసిన సంపత్ నందితో నాగ్ ఓ సినిమా చేయనున్నారట.
రచ్చ సినిమాతర్వాత బెంగాల్ టైగర్ సినిమాతో హిట్ కొట్టాడు సంపత్ నంది. ఇక ఇప్పుడు నాగార్జున కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశాడట సంపత్. ఇటీవలే నాగ్ ను కలిసి కథను కూడా వినిపించాడట సంపత్. కథ విన్న నాగార్జున, పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని వస్తే సినిమా చేద్దాం అని హామీ ఇచ్చారట. ప్రస్తుతం సంపత్ నంది అందుకు సంబంధించిన పనుల్లో ఉన్నాడట. నాగార్జునను కనుక సంపత్ నంది ఒప్పించగలిగితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టదు. ఈ సినిమాను కంపీల్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాలని భావిస్తున్నాడట సంపత్. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.