ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం.. ‘ఇరుముడి’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే

డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఇందులో మాస్ మాహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై ఇప్పటికీ భారీ హైప్ నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇటీవలే రిలీజ్ చేశారు.

ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం.. ఇరుముడి ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే
Irumudi

Updated on: Jun 07, 2026 | 3:24 PM

మాస్ మహారాజా రవితేజ ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఓ అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉండనుంది. గ్లింప్స్‌కు వచ్చిన విశేష స్పందనతో ఉత్సాహంతో ఉన్న చిత్రబృందం తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించింది. వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భంగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో రాబోయే రోజుల్లో వరుస ప్రమోషనల్ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రవితేజ, శివ నిర్వాణ పూర్తి అంకితభావంతో పని చేస్తూ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఎనర్జిటిక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను అలరించిన రవితేజ ‘ఇరుముడి’లో పూర్తిగా భిన్నమైన, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన నటన ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించనుంది. మానవ సంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో శివ నిర్వాణ ఈ కథను మనసుని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. అదే సమయంలో కమర్షియల్ అంశాలను కూడా సమతూకంగా మేళవించారు.

ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 21న విడుదలకానున్న ఈ సినిమా రవితేజ మంచి హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. చాలా రోజుల తర్వాత రవితేజ తన ట్రాక్ మార్చి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us