
సినిమా.. సమాజంలోని మంచిని చూపిస్తుంది.. చెడును చూపిస్తుంది. కానీ కథలోని మంచిని గ్రహించడం కొందరు మాత్రమే చేస్తుంటారు. అలాగే కొన్ని సినిమాల ప్రభావం జనాలపై తప్పకుండా ఉంటుంది. కేవలం వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ సినిమాను స్పూర్తి తీసుకున్నాడు ఓ పదేళ్ల కుర్రాడు. చిన్న వయసులోనే ఓ స్కూల్ దత్తత తీసుకుని కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బుతో ఆ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాడు. స్కూల్లో మొక్కలు నాటడం నుంచి క్లాస్ రూంలో బెంచీలు అందించడం.. విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, చెప్పులు ఇలా కావాల్సినవన్ని అందిస్తున్నాడు ఆ కుర్రాడు. అతడికి తన తండ్రి సహకారం కూడా అందండతో పాఠశాలకు ఏదో రకంగా అభివృద్ధి చేస్తున్నాడు. అతడి పేరే రఘునందన్. చిన్న వయసులోనే ఇలా సామాజిక సేవ చేయడానికి తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆదర్శం అని .. శ్రీమంతుడు సినిమా స్పూర్తి అని అంటున్నాడు.
ఖమ్మం జిల్లా మల్లవరం గ్రామానికి చెందిన రఘునందన్ అనే కుర్రాడు తనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు మల్లవరం మండల పరిషత్ ప్రాథమిక స్కూల్ దత్తత తీసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా చూసి.. ఇన్ స్పై్ర్ అయ్యి తన సొంత ఊరిలో స్కూల్ దత్తత తీసుకున్నాడట. చిన్నప్పుడే కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బుతో ఆ పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్నాడు. కొడుకు చేస్తోన్న మంచి పనికి అతడి తండ్రి కూడా తోడు నిలిచాడు. కుమారుడితో కలిసి పాఠశాలను అభివృద్ధి చేశారు. క్లాస్ రూంలో బెంచీలు, విద్యార్థులకు పుస్తకాలు అందించడం చేస్తున్నారు. ప్రస్తుతం రఘునందన్ వయసు 16 ఏళ్లు. హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడట. ఈ మేరకు ఆ కుర్రాడిని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయగా.. ఆ వీడియోను మహేష్ బాబు ఫ్యాన్స్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు అంటే ఇలా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్కూల్ టీచర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. స్కూల్ దత్తత తీసుకున్న మొదట మొక్కలు నాటమని తెలిపారు. రఘునందన్ నాటిన 100 మొక్కలు ఆ పాఠశాలకు ఎన్నో అవార్డులు వచ్చాయని.. జిల్లాలోనే ఉత్తమ స్వచ్చ పాఠశాలగా ఈ స్కూల్ అవార్డులు అందుకుందని తెలిపారు. స్కూల్ దత్తత తీసుకోవడానికి ముందు రఘునందన్ తాను చదువుకున్న తల్లాడలోని బాలభారతి స్కూల్లో మహాత్మ గాంధీ విగ్రహాన్ని పెట్టించాడట. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులతో గాంధీ విగ్రహాన్ని పెట్టించినట్లు తెలిపాడు రఘునందన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.