సిని’మా’ పోరు తుది దశకు చేరింది. గత కొద్ది నెలలుగా సాగుతున్నా సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు.. విమర్శలకు నేడు అసలైన పరీక్ష కాబోతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరగనున్నాయి. అక్టోబర్ 10న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో మా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే భారీ బందోబస్తు మధ్య ఏర్పాట్లను పూర్తిచేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక సాయంత్రం 4 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటల లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మా ఎన్నికలు సినీ పరిశ్రమలో మాటల యుద్దం నడిచింది. నువ్వా.. నేనా అంటూ బరిలో ఉన్నవారు మాత్రమే కాకుండా.. మద్దతు పలికిన వారి మధ్య కూడా వ్యక్తిగత పోరు కొనసాగింది.
ఇక మా ఎన్నికలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీట్ పెంచాయి. అభ్యర్థులు ఒకరిపై మరొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ.. ఫిర్యాదుల వరకు వెళ్లారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే.. మా ఎన్నికలలో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యాక్షులు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతోపాటు.. ట్రెజరర్ 18 మంది ఈసీ సభ్యులతో కలిపి మొత్తం 26 మందిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మాలో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా.. 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఈసారి ఎన్నికలు పూర్తిగా రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఇక ఈసారి ఎన్నికలలో మరీ ముఖ్యంగా సినీ పెద్దలు సైతం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమర్శలతో సిని’మా’ పరువు రోడ్డున పడేస్తున్నారని.. సభ్యులపై చర్యలు తీసుకోవాలని క్రమ శిక్షణ కమిటీ ఫిర్యాదులు క్యూ కట్టాయి. ఇక ఇన్ని రోజులు జరిగిన సవాళ్లకు నేడు అసలైన ఫలితం రాబోతుంది. మరికాసేపట్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇక సినీ ఆర్టిస్టులు, సినిమా కార్మికులు మా అధ్యక్ష పదవికి ఎవరికి పట్టం కట్టనున్నారో చూడాలి.
Also Read: Bigg Boss 5 Telugu: మరోసారి సిరికి క్లాస్ తీసుకున్న నాగార్జున… నిల్చొబెట్టి కడిపారేశాడుగా..
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..! రావణుడి పాత్ర ముగిసింది.. రాముడు కొనసాగుతున్నాడు..?