AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: 40 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. విధాత తలపున పాటకు అర్థం చెప్పిన సిరివెన్నెల..

సిరివెన్నెల సినిమా వచ్చి దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఆ మూవీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం 'సిరివెన్నెల' విడుదలయి 2026 నాటికి నాలుగు దశాబ్దాలు పూర్తైంది.

Trending Song: 40 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. విధాత తలపున పాటకు అర్థం చెప్పిన సిరివెన్నెల..
Song Meaning
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2026 | 4:52 PM

Share

కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘సిరివెన్నెల’. సర్వదామన్ బెనర్జీ, సుహాసిని, మూన్ మూన్ సేన్ , మీనా ముఖ్య పాత్రల్లో నటించారు. కె.వి. మహదేవన్ అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలోని విధాత తలుపున పాట ఎంత హిట్టైందో చెప్పక్కర్లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ విధాత తలపున పాటకు అర్థం వెల్లడించారు. పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి విధిరాత తలపున వంటి తన పాటల్లో కేవలం పదాల పొందిక కాకుండా, లోతైన జీవన తత్వాన్ని ప్రతిబింబింపజేస్తారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన నిద్ర, జననం, సృష్టి నాదంపై తన అపూర్వమైన దృక్పథాన్ని విశ్లేషించారు.

నిద్రను నిత్య నిధనంగా అంటే ప్రతిరోజు వచ్చే మరణంగా ఆయన అభివర్ణించారు. నిద్రించినప్పుడు మనం ప్రపంచాన్ని, మనల్ని మనం కూడా పూర్తిగా వదిలేస్తామని, ఒక రకంగా చనిపోతామని చెప్పారు. అయితే, మరుసటి రోజు ఉదయం మళ్ళీ లేస్తామనే ధీమాతో ఈ ఇష్టమైన చావుకు సిద్ధమవుతామని వివరించారు. ఈ క్రమంలో, మనం ప్రతి రోజు కొత్తగా పుడుతున్నామనే నిత్య జననం సత్యాన్ని అనుభవిస్తామని ఆయన ఉద్ఘాటించారు. ఇది వందేళ్ల క్యాలెండర్ జీవితం కాదని, ప్రతి రోజూ కొత్త పుట్టుకని తెలియజేశారు. తూర్పు కొండపై కిరణాలు అనే తంత్రుల్ని బిగించి, సూర్యుడు వీణ శ్రుతి చేస్తే, పక్షులు తమ రెక్కలనే వేళ్ళతో ఆ వీణా తంత్రుల్ని మీటుతుంటే పుట్టే నాదం మనకు మెలకువ తెప్పించి, సృష్టికి మూలం నాదం అని భాష్యం చెబుతుందనే కవితాత్మక చిత్రీకరణను ఆయన అందించారు.

ఇదే భావనను శిశువు జననానికి వర్తింపజేశారు. బిడ్డ పుట్టినప్పుడు ఏడవడం దుఃఖానికి సంకేతం కాదని, అది జీవన నాద తరంగమని సీతారామశాస్త్రి వివరించారు. తల్లి గర్భంలోని ఉమ్మనీటి నుంచి బయటికి వచ్చిన శిశువు, తొలిసారిగా పంచభూతాల ప్రపంచానికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు, శ్వాస తీసుకునే క్రమంలో వచ్చే ఆహ్ అన్న ధ్వనిని ఏడుపుగా భావిస్తామన్నారు. ఇది ముక్కులోని ఉమ్మనీరు తొలగిపోయి, పంచేంద్రియాలు ప్రకృతికి తెరుచుకునే క్రమం. ఈ ఏడుపు శిశువు తన మొట్టమొదటి జీవనాదాన్ని ప్రకటించడం. అప్పటివరకు తల్లి జీవనాదంతో కలగలిసిన బిడ్డ, ఇప్పుడు తనదైన జనియించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం ద్వారా తన ఉనికిని చాటుకుంటుంది. లబ్ డబ్ వంటి హృదయ స్పందనలు గర్భంలోనే ఉన్నప్పటికీ, పుట్టిన తర్వాత తన సొంత హృదయ మృదంగ ధ్వానం వినిపిస్తుంది. దీనికి ఆది అంతం లేదని, నిరంతరం కొనసాగే అనాది రాగం అని ఆయన అన్నారు. ప్రతిరోజు కొత్తగా పుట్టడమే కాబట్టి, ప్రతి క్షణం ప్రారంభమే అని వివరించారు.

సృష్టి అంతా నాదం నుంచే ఉద్భవించిందనే భారతీయ ఋషుల మాటలను ఆధునిక విజ్ఞానం కూడా రెసొనెన్స్ రూపంలో అంగీకరిస్తుందని శాస్త్రి తెలిపారు. పదార్థం, శక్తి అనే ప్రాథమిక భావనలకు శూన్యం మూలం కాగా, ఈ పదార్థం, శక్తి ఒకదానికొకటి ఇంటర్‌ఫేస్ అవుతున్నప్పుడు నాదం, తరంగ దైర్ఘ్యం ముఖ్య పాత్ర వహిస్తాయని వివరించారు. ఆ విశ్వ నాదమే అనేక జీవరాశుల రూపంలో వ్యక్తమవుతుందని ఆయన స్పష్టం చేశారు. మన జ్ఞాపకాలను బట్టి వయస్సు, జ్ఞానం గురించి మాట్లాడుకున్నప్పటికీ, విశ్వ చైతన్యం దృష్ట్యా ప్రతిరోజు కొత్తగానే పుడుతున్నామనేది సత్యమని చెప్పారు. “నేను కనుతెరిచి మానసము నుంచి జగతి సృష్టించినాను. నేను నిదురించి ఆకసములోన అంతమొందినాను. ఈ నిమేషమే నా విలాసం” అనే భావనతో, భగవంతుడు కన్ను తెరిస్తే జననం, మూస్తే మరణం అని, ఈ రెప్పపాట్లోనే జీవితం ఉందని ఆయన తన తాత్విక ఆలోచనను తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

విధాత తలపున సాంగ్..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

Follow Us