
సైబర్ మోసాల బారిన పడకండి అంటూ పోలీసులు పదే పదే జనాలను హెచ్చరిస్తున్నారు. ఓటీపీ, కేవైసీ అప్డేట్ చేయాలని మెసేజ్లు వస్తుంటాయని.. వాటికి రియాక్ట్ కావొద్దంటూ చెబుతుంటారు. అయితే దొంగలు మాత్రం ఎప్పుడూ కొత్త దారులను ఎంచుకుంటారు. జనాలను మోసం చేస్తూ వివిధ రకాలుగా నగదు దొచేస్తుంటారు. కొన్నాళ్ల క్రితం సెలబ్రెటీ పేరుతో మెసేజ్ చేసి డబ్బులు దొచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఓ సీరియల్ నటి పేరు చెప్పి లక్షలు స్వాహా చేసే పనిలో పడ్డారు కొందరు ఆకతాయిలు. సీరియల్ నటి లగ్జరీ లైఫ్ స్టైల్.. తొందరంగా కోటీశ్వరులు కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ యాడ్స్ చేస్తూ అందినకాడికి దొచేస్తున్నారు. ఈ విషయం కాస్త ఆ నటి చెవిన పడడంతో అసలు విషయం బయటపెట్టింది.
తమిళంలో బుల్లితెరపై రాజా రాణి సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది అలియా మానస. అదే సీరియల్లో తనతో కలిసి నటించిన సంజీవ్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరికి పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం ఆమె సన్ టీవీలో ఇనియా అనే సీరియల్‌లో నటిస్తోంది. భార్యభర్తలు ఇద్దరూ సీరియల్లలో నటించడమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో పలు వీడియోస్ షేర్ చేస్తున్నారు. అయితే అలియా మానస లక్షల్లో డబ్బు సంపాదిస్తుందని.. లగ్జరీ ఇళ్లు, కార్లు కొనుగోలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని.. ప్రతినెల లక్షల్లో సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. కొన్నిరోజుల క్రితం వణక్కం తిమిళగం అనే షోలో పాల్గొన్న అలియా మానస.. మార్కెటింగ్ స్కీమ్ గురించి చెప్పినట్లు.. దీని ద్వారా లెక్కలేనంతగా డబ్బు సంపాదిస్తున్నాని చెప్పినట్లు ఓ వీడియో వైరలయ్యింది. దీంతో ఆమెలాగే లగ్జరీ లైఫ్ స్టైల్, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే ఈ కింద లింక్ క్లిక్ చేయండి అంటూ నెట్టింట కొన్ని యాడ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ యాడ్స్ విషయం అలియా మానస దృష్టికి వెళ్లడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన పేరుతో వస్తున్న ప్రకటనలలో ఎలాంటి నిజం లేదని తెలిపింది అలియా మానస. ఆ మార్కెటింగ్ గురించి తనకేమి తెలియదని.. తాను కారు, ఇళ్లు కొన్న మాట నిజమేనని.. కానీ అవన్నీ తాను EMIలో కొన్నానని చెప్పుకొచ్చింది. “లోన్ తీసుకుంటే తిరిగి చెల్లించగలము అనే నమ్మకం ఉంది.. అందుకే లోన్ తీసుకుని కారు కొన్నాను.. అందుకు సంబంధించిన బిల్స్ నా దగ్గర ఉన్నాయి. అడ్డదారిలో డబ్బు సంపాదించి ఎవరూ కోటిశ్వరులు కాలేరు… అందుకే నా గురించి వస్తున్న వార్తలు అవాస్తవం.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ సమాచారం చూసి విదేశాల్లో ఉన్న స్నేహితులు కొందరు నాకు ఫోన్ చేసి ఎలా సంపాదిస్తున్నావని అడుగుతున్నారు. దీంతో వెంటనే నేను అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ ప్రకటనలను చూసి ఎంత మంది మోసపోయారో తెలియడం లేదు.. కానీ నేను కోటీశ్వరురాలిని కాదు.. చాలా అప్పుల్లో ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.