Kerala Police Tweet Allu Arjun Video: ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో పోలీసులు వినూత్న దారులు వెతుక్కుంటున్నారు. ప్రజలంతా సోషల్ మీడియాలో బిజీగా మారడంతో తామూ సోషల్ మీడియా ద్వారానే ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ట్విట్టర్‌ను అస్త్రంగా చేసుకొని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు చట్టాలను బేఖాతరు చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయో అర్థమయ్యేలా చెబుతున్నారు. ఇందుకోసం సినిమా హీరోలను, డైలాగ్‌లను కూడా వాడుకుంటున్నారు.
అయితే తాజాగా హీరో అల్లు అర్జున్‌ను కేరళ పోలీసులు ఇందుకోసం ఉపయోగించుకున్నారు. తాజాగా కేరళ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేందుకుగాను ‘పోల్’ పేరుతో ఓ యాప్‌ను తీసుకొచ్చారు. కష్టాల్లో, ఆపదలో ఉన్న వారెవరైనా ఈ యాప్ ద్వారా చిన్న సందేశం పంపిస్తే చాలు వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ యాప్ ప్రచారం కోసమే బన్నీని ఉపయోగించుకున్నారు. ఇందుకోసం బన్నీ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని వాడుకున్నారు. ఈ సినిమాలో బన్నీ పోలీస్ డ్రస్‌లో.. ఆపదలో తన కుంటుంబ సభ్యులను ఆదుకునేందుకు బైక్‌పై వేగంగా వచ్చే వీడియోను పోస్ట్ చేస్తూ.. యాప్ గురించి వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బన్నీకి కేరళలో భారీగా అభిమానులున్న విషయం తెలిసిందే. బన్నీ నటించిన దాదాపు అన్ని చిత్రాలు కేరళలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక తమ హీరోకు పక్క రాష్ట్రానికి చెందిన పోలీసులు ఇలా గౌరవించడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
പോൽ ആപ്പ് – പോലീസ് സേവനങ്ങൾ ഇനി ഒരു കുടക്കീഴിൽ pic.twitter.com/I9Pwx9Q8uc
— Kerala Police (@TheKeralaPolice) February 19, 2021