JD Chakravarthy: ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను.. జేడీ చక్రవర్తి మనసులోని మాట..

శివ సినిమా తర్వాత విలన్ పాత్రలు వస్తున్నా.. నాగార్జున సలహాతో హీరోగా మారాలని నిర్ణయించుకున్నట్టు నటుడు జేడీ చక్రవర్తి అన్నాడు. 'నీలో హీరో మెటీరియల్ ఉంది, విలన్‌గా స్థిరపడకు' అని నాగార్జున ఇచ్చిన ఆ ఒక్క సలహా.. తన కెరీర్‌‌ను మార్చేసిందని తెలిపాడు.

JD Chakravarthy: ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను.. జేడీ చక్రవర్తి మనసులోని మాట..
Jd Chakravarthy

Updated on: Dec 27, 2025 | 12:32 PM

టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి తన కెరీర్‌పై అక్కినేని నాగార్జున ప్రభావం ఏమేరకు ఉందో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 1989లో విడుదలైన శివ చిత్రంతో జేడీ చక్రవర్తి విలన్‌గా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దానితో ఆపై అతడికి వరుసగా విలన్ ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఓవర్‌నైట్‌లోనే క్రేజ్ తెచ్చుకున్న జేడీ.. ఆ తర్వాతి నాలుగు సంవత్సరాలలో(1989-1993) కేవలం ఏడు లేదా ఎనిమిది విలన్ పాత్రలు మాత్రమే చేశాడు. ఇందుకు ప్రధాన కారణం అక్కినేని నాగార్జున ఇచ్చిన సలహా అని అతడే స్వయంగా చెప్పాడు.

శివ సినిమా విడుదల కాకముందే నాగార్జున తనను ‘నేటి సిద్ధార్థ’, ‘కిల్లర్’ సినిమాలకు సిఫార్సు చేశాడని జేడీ అన్నాడు. ‘కిల్లర్’ చిత్రం సమయంలో నాగార్జున తనతో కో-డైరెక్టర్ షిండేతో టచ్‌లో ఉండమని చెప్పాడన్నాడు. షిండేతో కొన్ని రోజులు బాగానే మాట్లాడినా, తర్వాత ఆయన తనను దూరం పెట్టడం ప్రారంభించారని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై నాగార్జునను కలిశాను. షిండే అంశం గురించి పూర్తిగా వివరించాను. ‘క్లియర్‌గా అర్థమైంది. నిన్ను అవాయిడ్ చేయమని నేనే షిండేతో చెప్పాను’ అని నాగార్జున సమాధానం ఇవ్వడంతో షాక్ అయ్యాను.

తాను డబుల్ గేమ్ ఆడనన్న వ్యక్తి.. ఇలా ఎందుకు చేశాడా అని అలోచించాను. అప్పుడే నాగార్జున నాతో ఒక విషయం చెప్పాడు. ‘చక్రి, నేను చెప్పినప్పుడు నువ్వు ఈ సినిమాకు బాగుంటావనిపించింది. కానీ, నువ్వు మిగతా సినిమాలు కూడా చేయకూడదు. నువ్వు హీరో మెటీరియల్. ఈ సినిమా చేసి, అది ఆడితే విలన్‌గా మంచి గుర్తింపు వస్తుంది, స్థిరపడిపోతావు. అప్పుడు నిన్ను ఎవరూ హీరోగా పెట్టుకోరు’ అని నాగార్జున స్పష్టం చేశాడు. సినీ పరిశ్రమకు వచ్చే ప్రతి ఒక్కరికీ హీరో కావాలనే కోరిక ఉంటుందని, పరిస్థితులను బట్టి వేరే పాత్రలు చేస్తారని జేడీ చక్రవర్తి చెప్పాడు. నాగార్జున సలహా తనలో హీరో కావాలనే కోరికకు బలాన్ని చేకూర్చింది. ఆ తర్వాత తాను విలన్ పాత్రలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..