
జబర్దస్త్.. గత 12 ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న కామెడీ షో. ఈ క్రమంలోనే ఎంతో మంది ట్యాలెంటెడ్ నటీనటులను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిందీ ఈ టీవీ షో. జబర్దస్త్ షోలో పనిచేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ… ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా సత్తా చాటుతున్నారు. అయితే ఆ మధ్యన జబర్దస్త్ జోరు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యనే మెగాబ్రదర్ నాగబాబు మళ్లీ ఈ జబర్దస్త్ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. జడ్జిగా ఈ కామెడీ షోకు కొత్త కళ తెచ్చారు. అంతేకాదు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జబర్దస్త్ షోకు రేటింగ్ కూడా బాగా పెరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది.
గతంలో జబర్దస్త్ వేదికపై స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటోన్న ఓ నటుడు మళ్లీ ఈ కామెడీ షోకు వస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. అతను మరెవరో కాదు పంచులు, ప్రాసలకు పెట్టింది పేరైన హైపర్ ఆది. ఇటీవలే ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఈ షోకు హైపర్ ఆది కూడా వచ్చాడు. అయితే జస్ట్ గెస్ట్ గానే. ఈ సందర్భంగా మాట్లాడిన హైపర్ ఆది నాగబాబు గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. జబర్దస్త్‌లో తన స్కిట్స్ కు మంచి రేటింగ్, వ్యూస్ రావడంలో నాగబాబు పాత్ర కూడా ఉందన్నాడు ఆది. ‘జబర్దస్త్ లో ఎవరెన్ని స్కిట్లు చేసినా నా స్కిట్‌లో జరిగిన మేజిక్ ఏంటంటే.. మీరు కొంచెం గ్యాప్ ఇవ్వమని అడగటం.. ఆది నరుకుతున్నాడు అనే మాట అనడం ఈ పదాలు నాకు బూస్ట్ ఇచ్చాయి’ అని ఆది చెప్పుకొచ్చాడు.
ఇంతలోనే జబర్దస్త్‌కు మళ్లీ ఎప్పుడొస్తావు అని నాగబాబు అడగ్గా ఆది ఇలా సమాధానమిచ్చాడు.. ‘ నన్ను ఎవరైతే మిస్ అయ్యారో వీళ్లతో కాంబినేషన్ సెట్ చేసుకుని ఈ జబర్దస్త్ షోకు వస్తా.. జూన్‌లో రీ ఎంట్రీ ఉంటుంది’ అని ఆది చెప్పాడు. మొత్తానికి హైపర్ ఆది తో జబర్దస్త్ కు మరింత కొత్త కళ వస్తుందని చెప్పుకోవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.