AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBOMMAకు బొమ్మ చూపించిన హైదరాబాద్ పోలీసులు.. ఏకంగా 3 కోట్లు హుష్‌కాకి..

ఐ-బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్‌ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని.. పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇన్నేళ్లుగా కరేబియన్ దీవుల్లో ఉంటూ ఇమ్మడి రవి.. ఐ-బొమ్మ సైట్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది

IBOMMAకు బొమ్మ చూపించిన హైదరాబాద్ పోలీసులు.. ఏకంగా 3 కోట్లు హుష్‌కాకి..
Ibomma
Vijay Saatha
| Edited By: |

Updated on: Nov 15, 2025 | 12:44 PM

Share

రిలీజ్ అవుతున్న సినిమాలను గంటల వ్యవధిలో తమ వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్న ఐ బొమ్మ నిర్వాహకులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలల పాటు పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్న ఐ బొమ్మ నిర్వాహకులు కరేబియన్ దీవుల్లో ఉంటూ వెబ్సైట్ను నడిపిస్తున్నారు. ఇమ్మడి రవి అనే నిర్వహకుడిని పోలీసులు కూకట్పల్లిలో అరెస్టు చేశారు. ఫ్రాన్స్ దేశం నుండి నిన్ననే హైదరాబాద్ కి వచ్చిన రవి ఐ బొమ్మ వెబ్సైట్ను నిర్వహిస్తున్నాడు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న రవి అకౌంట్లో ఉన్న మూడు కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆగస్టు 30న ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ IBOMMA పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. టీవీ9 చేతిలో ఈ ఎఫ్‌ఐఆర్ కాపీ ఎక్స్క్లూజివ్‌గా లభించింది. చిత్ర పరిశ్రమకు భారీ నష్టం జరుగుతుందనే ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ అధికారి ఎర్ర మనీంద్ర బాబు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. IBOMMA కింద దాదాపు 65 మైనర్ పైరసీ వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలోనే ఐ బొమ్మ తమ ప్లాట్‌ఫారమ్‌లో ఉంచడం వల్ల గత సంవత్సరం మాత్రమే సినీ పరిశ్రమకు సుమారు 3000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వివరించారు.

IBOMMA వీడియోలను Cloudflare హోస్టింగ్ సర్వర్ ద్వారా అప్లోడ్ చేస్తున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ సర్వర్లు విదేశాల నుండి ఆపరేట్ అవుతుండటంతో వీటిని ట్రేస్ చేయడం, క్రాక్ చేయడం కష్టం అవుతోందని పోలీసులు చెబుతున్నారు. పైరసీ వెబ్‌సైట్లలో 95 శాతం Cloudflare సర్వర్లను ఉపయోగిస్తున్నాయని కూడా విచారణాధికారులు గుర్తించారు. ప్రతిసారి ప్రాక్సీ డొమెయిన్‌లు ఉపయోగించి URL మారుస్తూ ఐబొమ్మ సర్వర్‌ వ్యవస్థను రక్షించుకుంటోందని అధికారులు వెల్లడించారు.

ఫిర్యాదులు చేసినందుకు ప్రొడ్యూసర్లను నేరుగా బెదిరించే లేఖలు రాయడం, సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులు పెడుతుండటం పట్ల కూడా ఫిలిం ఛాంబర్ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా తండేల్ సినిమా విడుదల సమయంలో కూడా ఐబొమ్మ పై విస్తృతంగా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఇండియాలో మాత్రమే ఐబొమ్మకు నెలకు సుమారు 37 లక్షల విజిట్స్ వస్తున్నాయని సైబర్ క్రైమ్ విభాగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పైరసీ మాఫియా పై కఠిన చర్యలకు సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధమవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.