
టాలీవుడ్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన అద్భుతమైన నటనతోనే కాకుండా, తన పదునైన కలంతోనూ తెలుగు సాహితీ జగత్తులో చెరగని ముద్ర వేశారు. గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నవలలు, వాటి వెనుక ఉన్న ఆసక్తికర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తన రచనలు సమాజంలోని అత్యున్నత శిఖరాల నుంచి అట్టడుగు స్థాయి వ్యక్తుల వరకు ఎలా చేరువయ్యాయో ఆయన వివరించారు. గొల్లపూడి రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన నవలల్లో ‘సాయంకాలం అయ్యింది’ ఒకటి. ఈ నవలకు వచ్చిన స్పందన చూసి ఆయనే ఆశ్చర్యపోయారు. దేశ మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావు వంటి మేధావి ఈ నవలలోని ‘రేచకుడు’ పాత్రను ప్రశంసిస్తూ స్వయంగా ఉత్తరం రాశారు. అదే సమయంలో, చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న ‘మొద్దు శీను’ కూడా ఈ నవలను చదివి ప్రభావితుడై, గొల్లపూడిని తన గురువుగా పేర్కొంటూ లేఖ రాయడం విశేషం. ఒక ప్రధాని, ఒక ఖైదీ ఇద్దరి మనసులను గెలుచుకోవడం తన రచనా ప్రస్థానంలో మరుపురాని ఘట్టమని ఆయన పేర్కొన్నారు.
ఇది చదవండి: అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది.. ఎందుకంటే.?
ఆయన కలం నుంచి జాలువారిన ‘రుణం’ నవల వైష్ణవ సంప్రదాయం నేపథ్యంలో సాగితే, ‘ఎర్ర సీత’ నవల స్త్రీల మనోభావాలను అద్దం పట్టింది. అయితే ఒడిశాలోని అనుభవాల ఆధారంగా రాసిన ‘జుజుముర’ కథ అంటే ఆయనకు ప్రాణం. ఈ కథను సినిమాగా మలచాలని దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ప్రయత్నించారు, అలాగే సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీతం అందించడానికి సిద్ధపడ్డారు. ఇంతటి గొప్ప కలయిక కుదిరినప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడం పట్ల ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఆత్మకథ ‘జీవనకాలం’ గురించి మాట్లాడిన ఆయన.. అందులో ఎక్కడా అసత్యాలకు చోటు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సాధారణంగా ఆత్మకథలు రాసేటప్పుడు రచయితలు తమ గురించి గొప్పగా చెప్పుకోవడానికి లేదా నిజాలను దాచడానికి ప్రయత్నిస్తారని.. కానీ తాను మాత్రం గాంధీజీ మార్గంలో పూర్తి నిబద్ధతతో, నిజాన్ని మాత్రమే ఆవిష్కరించానని చెప్పారు. తన జీవితంలోని వెలుగు చీకట్లను ఏమాత్రం దాచకుండా పాఠకుల ముందు ఉంచానని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. నటుడిగా వందలాది పాత్రల్లో మెరిసినా, రచయితగా అక్షర సేద్యం చేయడంలోనే తనకు నిజమైన తృప్తి దొరికిందని గొల్లపూడి మారుతీరావు ఆ సమయంలో చెప్పేవారు.
ఇది చదవండి: అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి