నచ్చిన హీరోలపై తమ అభిమానాన్ని చాటేవాళ్లు చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరూ ఒక్కోలా అభిమానాన్ని వ్యక్తపరుస్తుంటారు. కొందరు హీరోల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకుంటే, మరికొందరు వివిధ రూపాల్లో తమతమ అభిమానాన్ని వ్యక్తపరుస్తుంటారు. తాజాగా, మెగాపవర్‌స్టార్ రాంచరణ్‌పై (Ram Charan) ఓ ఫ్యాన్ వీరాభిమానాన్ని చాటుకున్నాడు. ఆర్టిస్ట్ కమ్ వీరాభిమాని జైరాజ్, రామ్‌చరణ్ చిత్రం ఆకారంలో వడ్లను పండించి ఔరా అనిపించాడు. గద్వాల్ జిల్లా గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డిలోని తనపొలంలో రామ్‌చరణ్ వరిచిత్రాన్ని పండించి అభిమానాన్ని చాటుకున్నాడు. అందుకు జైరాజ్ మూడునెలలపాటు శ్రమించాడు. రామ్‌చరణ్ ప్రతి పుట్టినరోజుకు ఏదోఒక కళారూపాన్ని రూపొందిస్తూ, తన అభిమానాన్ని చాటుకుంటున్నారు జైరాజ్. అక్కడితో ఆగకుండా 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిమరీ రామ్‌చరణ్‌ను కలుసుకున్నాడు.
జైరాజ్ అభిమానాన్ని చూసి చరణ్ మురిసిపోయారు. అతని కృషిని అభినందించారు రాంచరణ్. మారుమూల గ్రామంలో ఉన్న తనను గుర్తించి సపోర్ట్ చేస్తున్న రామ్‌చరణ్ థ్యాంక్స్ చెప్పారు జైరాజ్. ఆయన్ని కలుసుకున్న క్షణాలు గుండెల్లో పెట్టుకుని దాచుకుంటానని చెప్పాడు. జైరాజ్ తన ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్తూ, రామ్‌చరణ్ వరి చిత్రాన్ని పొలాల్లో పండించేందుకు చాలా ఖర్చు అయ్యిందని, యూఎస్‌లో ఉన్న విజయ్ ఆ ఖర్చును భరించారని వివరించారు. రామ్‌చరణ్ వరిచిత్రాన్ని ప్రారంభించేప్పుడు చాలామంది తనను ఎద్దేవా చేశారని చెప్పారు జైరాజ్. కానీ, తాను మాత్రం వెనకడుగు వేయకుండా, రామ్‌చరణ్‌పై ఉన్న అభిమానంతో పనిచేశానని స్పష్టం చేశారు. ప్రస్తుతం చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.