గతేడాది సంక్రాంతికి విడుదలైన ఎఫ్2.. (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు బయటికి వచ్చేటప్పుడు ఒక నవ్వు మొహంతో వచ్చేలా ఉంటుంది ఈ సినిమా. కామెడీ నేపథ్యంగా తీసుకొని దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను చక్కగా తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఎంపికైంది. ఇండియన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాలీవుడ్ నుంచి ‘F2’కు ఈ అవార్డు దక్కింది.
దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 నిర్మిస్తున్నారు దిల్ రాజు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపుదిద్దుకుంటోన్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో రెండు ట్రాలీల నిండా వెంకటేశ్, వరుణ్ తేజ్ డబ్బు తీసుకెళ్తున్నారు. పూర్తి స్థాయి కామెడీని పంచుతూ ఎఫ్ 3తో మరోసారి హిట్ కొట్టాలని ఈ హీరోలు భావిస్తున్నారు. కాగా, ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విక్టరీ వెంకటేశ్‌కు అందరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎఫ్3 కూడా భారీ విజయాన్ని సాధించాలని ఆశీర్వదిస్తున్నారు. కరోనాతో విసిగివేజారిని ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.