
మూవీ రివ్యూ: ఎపిక్
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, కళ్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి, శివాజీ, వాసుకి తదితరులు
ఎడిటింగ్:నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ:అజీమ్ మహమ్మద్
సంగీతం: హేషమ్ అబ్ధుల్ వహాబ్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకుడు: ఆదిత్య హాసన్
కథ:
ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) చదువు అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. దాంతో వాళ్ల నాన్న (శివాజీ) ఆదిత్యను యుకే పంపించి చదువుకుని జాబ్ చేయమంటాడు. అమ్మానాన్న ప్రెజర్ తట్టుకోలేక లండన్ వెళ్తాడు ఆదిత్య. అక్కడికి వెళ్లిన మొదటి రోజే కడలి (వైష్ణవి చైతన్య)తో పరిచయం ఏర్పడుతుంది. ఒక్కరోజునే వీళ్లిద్దరూ మంచి స్నేహితులు అయిపోతారు. అనుకోకుండా ఆదిత్య రూమ్‌కు వచ్చిన కడలి.. అక్కడే ఉండిపోవచ్చా అని అడుగుతుంది. అలా ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉంటూ లివ్ ఇన్ సాగిస్తూ ఉంటారు. కానీ నో హార్ట్ ఫీలింగ్స్ అంటూ కేవలం శారీరకంగా మాత్రమే దగ్గరవుతుంటారు. చదువు అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకుందాం అనేది వాళ్ల ఒప్పందం. కానీ 10 నెలలు కలిసున్న తర్వాత ఇద్దరి మధ్య తెలియకుండానే రిలేషన్ ఏర్పడుతుంది. అప్పుడు వాళ్లేం చేసారు.. కలిసిపోయారా లేదంటే ముందు మాట్లాడుకున్నట్లు నో హార్ట్ ఫీలింగ్స్ అంటూ బైబై చెప్పుకున్నారా అనేది అసలు కథ..
కథనం:
కొన్ని కథలు వినడానికి చాలా సింపుల్‌గా ఉంటాయి కానీ.. అవి స్క్రీన్ మీదకు వచ్చినపుడు చాలా కాంప్లికేటెడ్‌గా, కన్ఫ్యూజింగ్‌గా ఉంటాయి. ఎపిక్ సినిమా విషయంలో ఇదే జరిగింది. చాలా సింపుల్ కథగానే దీన్ని ఆదిత్య హాసన్ చెప్పాలనుకున్నాడు. నిజానికి అదే అతడి స్ట్రెంత్ కూడా. ఎందుకంటే 90స్‌లో అప్పటి వరకు మనం రోజూ చూసిన సంఘటనలే చాలా కొత్తగా అనిపించాయి. అలాంటిదే ఇందులో కూడా ట్రై చేసాడు. ఫస్టాఫ్ వరకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు ఆదిత్య హాసన్.. కానీ కీలకమైన సెకండాఫ్‌కు వచ్చేసరికి మాత్రం పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు.
కథ ఉన్నచోటే ఉంటూ ఒకే రూమ్‌లో బంధీ అయినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్ మాత్రం చాలా స్పీడ్‌గానే వెళ్లిపోయింది.. తాను చెప్పాలనుకున్న కథను బోల్డ్‌గా చెప్పాడు ఆదిత్య. సెన్సార్‌కు భయపడి వెనక్కి తగ్గలేదు.. చూసుకుందాం అన్నట్లు రాసాడు. ఇలా చెప్పాలంటే కూడా చాలా ధైర్యం కావాలి ఓ దర్శకుడికి. అసలేమాత్రం బెరుకు భయం లేకుండా ఇద్దరు అడల్ట్స్ గురించి, వాళ్ల సొంత అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు ఫస్టాఫ్ అంతా చాలా రిలేటబుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా అబ్రాడ్ వెళ్లిన వాళ్లకు ఈ సినిమా గట్టిగానే హిట్ చేస్తుందేమో..? ఏం తెలియని కుర్రాడు యుకే రావడం.. అక్కడికి వచ్చాక ప్రతీది తనకు కొత్తగా ఉండటం..అలాంటి సమయంలో ఓ అమ్మాయి పరిచయం.. అక్కడ్నుంచి వాళ్ళ ప్రయాణం.. అదంతా ఫటాఫట్ జరిగిపోతుంది.. ఇంటర్వెల్ వరకు నో కంప్లైంట్స్. సెకండాఫ్ అదే టెంపో మెయింటేన్ చేయలేకపోయాడు.. చేసుంటే మాత్రం నిజంగానే టైటిల్‌కు న్యాయం జరిగేదేమో..? క్లైమాక్స్‌కు ముందు వచ్చే అమ్మా నాన్నల ఫోన్ సీన్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. కొడుకు బయటి దేశంలోనే ఉండాల్సిన పనిలేదు..ఆ ఒక్క ఫోన్ కాల్ హైదరాబాద్, బెంగళూరులో ఎక్కడెక్కడో కుటుంబానికి దూరంగా బతుకుతున్న వాళ్లందరినీ కదిలిస్తుంది. ఓవరాల్‌గా బోల్డ్ కథను భయం లేకుండా చూపించాడు ఆదిత్య హాసన్.
నటీనటులు:
ఆనంద్ దేవరకొండ బాగా నటించాడు.. స్క్రీన్ మీద అమాయకంగా కనిపించాడు..వైష్ణవి చైతన్య క్యారెక్టర్స్ సెలక్షన్ చూస్తుంటే భయమేస్తుంది.. చాలా ధైర్యం కావాలి వరుసగా ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి..! బేబీ చేసినపుడే వామ్మో అనుకున్న వాళ్లకు కడలి పాత్ర మరింత షాక్ ఇస్తుంది. నటిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది వైష్ణవి. శివాజీ, వాసుకి ఉన్నంత వరకు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. కళ్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి క్యారెక్టర్స్ బాగా సపోర్ట్ చేసారు. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
హేషమ్ అబ్ధుల్ వహాబ్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్. ముఖ్యంగా ఆర్ఆర్ బాగుంది.. అలాగే పాటలు కూడా చూడ్డానికి బాగున్నాయి. సంచారమే అయితే మరీనూ..! సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్‌గా ఉంది.. ఎడిటింగ్ సెకండాఫ్‌లో వీక్ అనిపించింది.. అది ఫోకస్ చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడిగా ఆదిత్య హాసన్ బోల్డ్ అటెంప్ట్ చేసాడు. 90స్ తీసిన ఆదిత్య హాసన్‌యేనా ఇది తీసింది అనే డౌట్ అయితే వస్తుంది..చెప్పాలనుకున్న కథ బాగుంది.. కానీ అక్కడక్కడా కన్ఫ్యూజ్ అయ్యాడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ఎపిక్.. డీసెంట్ అండ్ బోల్డ్..!