Marthand K Venkatesh: ఆ 10 నిమిషాల సీన్ తీసేయకపోయి ఉంటే.. జయం మనదేరా మూవీ ఫ్లాప్ అయ్యేది..

ప్రముఖ సినిమా ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తన 500 చిత్రాల అనుభవం, 90 శాతం సక్సెస్ రేట్ గురించి పంచుకున్నారు. పెళ్లి సందడితో తన కెరీర్ ప్రారంభం, సురేష్ ప్రొడక్షన్స్‌తో అనుబంధం గురించి వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Marthand K Venkatesh: ఆ 10 నిమిషాల సీన్ తీసేయకపోయి ఉంటే.. జయం మనదేరా మూవీ ఫ్లాప్ అయ్యేది..
Jayam Manade Ra Movie

Updated on: May 10, 2026 | 11:47 AM

తెలుగు సినీ పరిశ్రమలో ఒక సినిమా విజయం సాధించాలంటే దర్శకుడు, హీరో ఎంత ముఖ్యమో.. తెర వెనుక ఉండి సినిమా గమనాన్ని మార్చే ఎడిటర్ కూడా అంతే ముఖ్యం. టాలీవుడ్ హిస్టరీలో ఎడిటింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు మార్తాండ్ కె. వెంకటేష్. ఇండస్ట్రీలో సక్సెస్ రేటు కేవలం 2-4 శాతంగా ఉన్న ఈ రోజుల్లో, ఏకంగా 500లకు పైగా చిత్రాలకు పనిచేసి, సుమారు 90 శాతం విజయాలను అందుకోవడం ఆయనకే సాధ్యమైంది. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, నిక్కచ్చిగా మాట్లాడే తత్వం ఆయన్ని లెజెండరీ ఎడిటర్‌గా నిలబెట్టాయి.

వెంకటేష్ కుటుంబానికి సినీ రంగంతో మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఆయన తండ్రి కూడా ఎడిటింగ్ రంగంలో ఉండటంతో చిన్నప్పటి నుంచే ఆ వాతావరణంలో పెరిగారు. హీరో జగపతిబాబు ప్రోత్సాహంతో, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ‘అల్లరి ప్రియుడు’ సినిమాతో వెంకటేష్‌ను ఎడిటర్‌గా పరిచయం చేశారు. ఆయన్నే తన మొదటి గురువుగా భావిస్తారు వెంకటేష్. ఆయన కెరీర్‌లో ‘పెళ్లి సందడి’ సినిమా ఒక పెద్ద మలుపు. ఆ చిత్రం సాధించిన ఘనవిజయం వెంకటేష్ పేరును మారుమోగించింది. ముఖ్యంగా ఆ సినిమా క్లైమాక్స్‌లో సంభాషణలు లేకుండా కేవలం పాటతోనే భావోద్వేగాలను పండించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. కెరీర్ ప్రారంభంలో ఆయన ఎడిట్ చేసిన పది సినిమాల్లో ఏడు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో, “వెంకటేష్ ఎడిటింగ్ చేస్తే సినిమా హిట్” అనే ముద్ర పడిపోయింది.

డి. రామానాయుడు, సురేష్ బాబుతో వెంకటేష్‌కు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. వారిని తన కుటుంబానికి “గాడ్ ఫాదర్లు”గా ఆయన అభివర్ణిస్తారు. సురేష్ ప్రొడక్షన్స్ అంటేనే పక్కా ప్లానింగ్, స్క్రిప్ట్ మీద నమ్మకం. హీరో ఎవరు అనే దానికంటే, కథకు ఎవరు సరిపోతారో వారినే ఎంపిక చేస్తారని, బడ్జెట్ విషయంలో క్రమశిక్షణగా ఉంటారని వెంకటేష్ వివరించారు. అందుకే వారి సినిమాలు ఫ్లాప్ అయినా ఆర్థికంగా పెద్దగా నష్టపోరని ఆయన విశ్లేషించారు. సినిమా అంటేనే చివరి నిమిషం మార్పులు. ‘జయం మనదేరా’ సినిమా విషయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని ఆయన పంచుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పద్ధతి ప్రకారం సినిమా విడుదలకు ముందు ఒక షో వేసి ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఆ సినిమాలో వెంకటేష్ మరణించే సన్నివేశాలకు ప్రేక్షకులు విపరీతంగా ఏడ్చారు. అది సినిమా ఫలితంపై ప్రభావం చూపుతుందని గ్రహించి, అర్ధరాత్రి ఎడిటింగ్ టేబుల్‌పై కూర్చుని దాదాపు 20 నిమిషాల నిడివిని, కొన్ని యాక్షన్ షాట్లను కత్తిరించేశారట. అదే ఆ సినిమాను సేఫ్ జోన్‌లోకి తెచ్చిందంటారు మార్తాండ్ కె వెంకటేష్. అలాగే పూరి జగన్నాథ్ గురించి చెబుతూ, ఆయన టెక్నీషియన్లను నమ్ముతారని, ఎడిటింగ్ విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తారని కొనియాడారు.

Follow Us